వైసీపీలో పెను మంటలు.. మంత్రులు,ఏంపీలపై పట్టుకోల్పోతున్న జగన్

ABN , First Publish Date - 2020-06-23T16:01:02+05:30 IST

వైసీపీలో పెను మంటలు.. మంత్రులు,ఏంపీలపై పట్టుకోల్పోతున్న జగన్

వైసీపీలో పెను మంటలు.. మంత్రులు,ఏంపీలపై పట్టుకోల్పోతున్న జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై పట్టు కోల్పోయారా? గత కొన్ని రోజులుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు? గనుల మంత్రి పెద్దిరెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తాజాగా చేసిన ప్రకటనలతో ముఖ్యమంత్రి జగన్‌కి ఎలాంటి పరిస్థితి వచ్చింది? అధినేతనే ఇరుకున పెట్టేలా మంత్రులు మాట్లాడటాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? ఆసక్తికర కథనం ఇప్పుడు తెలుసుకోండి.


    ఏపీ అధికార పక్షంలో గందరదోళం మొదలైంది. పార్టీ మంత్రులు, ఎంపీలపై ముఖ్యమంత్రి జగన్‌ పట్టు కోల్పోయిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరు మంత్రులు చేస్తున్న ప్రకటనలు అయితే సీఎం జగన్‌కే మచ్చ తెచ్చేలా పరిణమించాయి. ఎందుకిలా జరుగుతోంది? జగన్‌ కనుసన్నల్లో పార్టీ నడక సాగడం లేదా? ఆయన చెప్పుచేతల్లో వైసీపీ ముఖ్య నేతలు అడుగులు వేయడం లేదా? తాజాగా వ్యక్తమవుతున్న అసంతృప్త స్వరాలకీ, ఎంపీల తిరుగుబాట్లకీ కారణం ఏంటి? ఈ ప్రశ్నలే ఇప్పుడు రాజకీయ పరిశీలకులతోపాటు ప్రజల్లోనూ చర్చకి దారితీస్తున్నాయి. 


    వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్నే తీసుకుందాం. వైసీపీ హైకమాండ్‌పై తనకున్న అసంతృప్తిని ఆయన బాహాటంగానే వ్యక్తంచేశారు. నిజానికి తొలి దశలోనే ఈ అంశాన్ని జగన్‌ పట్టించుకుని ఉంటే పరిస్థితి చేయిదాటిపోయేది కాదు. కానీ ఆయన ఖాతరుచేయలేదు. పార్టీ పెద్దలెవరూ సముదాయించే ప్రయత్నం చేయకపోగా కొందరు వైసీపీ నేతలు ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై నోరుచేసుకున్నారు. కనీసం అప్పుడైనా వైసీపీ అధినేత హోదాలో జగన్‌ కల్పించుకుని ఉంటే బాగుండేది. కానీ ఆయన స్పందించలేదు. దీంతో రచ్చ రంబోలా అయ్యింది. ఈ జగడం జనానికి వేడుకగా మారింది. 


    "నా అంతట నేను ఎప్పుడూ వైసీపీలోకి రావాలని అనుకోలేదు. ఎంతో బతిమాలితేనే వచ్చాను. నాకు సీటు ఇవ్వమని ఎవర్నీ ప్రాధేయపడలేదు. మీరు రావాలి, మీరు వస్తేనే మాకు సీట్లు పెరుగుతాయి అని బతిమాలారు..'' అని రఘురామ కృష్ణంరాజు జగన్‌ కోటరీపై విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గానికి వెళ్లాలంటే రక్షణలేకుండా పోయిందనీ, తన ప్రాణాలకు ముప్పుందనీ, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనీ కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కి ఆయన ఫిర్యాదుచేసే వరకు పరిస్థితి విషమించింది. ముఖ్యమంత్రి జగన్‌కి పార్టీ నేతలపై అదుపులేపోవడం వల్లే ఇంత రభస జరిగిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్వపక్ష నేతలు కట్టుదాటి ప్రవర్తిస్తుంటే జగన్‌ చోద్యం చూడటం ఆశ్చర్యకర అంశమే. పార్టీ నేతలను అదుపాజ్ఞలలో పెట్టడంలో అధినేత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కొందరు అంటున్నారు. 


    గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారశైలి. ఇందుకు లేటరైట్ గనుల వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన వివరణను కొందరు ఉదహరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో లేటరైట్‌ మైనింగ్‌ అక్రమాలపై "అధికార ఆయుధంతో బెదిరింపుల బిజినెస్‌.. ఏడాదికి 180 కోట్లు" అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. లేటరైట్ మైనింగ్ వ్యవహారంలో వాస్తవాలను మరుగున పెడుతూ, మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. అలాగే 2014 నుంచి తవ్వుతున్న లేటరైట్‌కు కొత్త అనాలసిస్‌ను కూడా ఆయన చెప్పలేదు. మరీ ముఖ్యంగా  "ఆంధ్రజ్యోతి" తన కథనంలో ముఖ్యనేత.. ముఖ్యనేతలు అని రాసిందే గానీ సీఎం జగన్‌ అని ఎక్కడా పేర్కొనలేదు. అయినా మంత్రి పెద్దిరెడ్డి మాత్రం.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావించడం ఆశ్చర్యకర పరిణామం!


   నిజానికి నిప్పులేనిదే పొగరాదంటారు. మరి లేటరైట్ గనుల వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌కు ప్రమేయం లేదనే మాట.. మంత్రి నోట ఎందుకు వచ్చింది? అనేది చర్చనీయాంశం అయింది. అసలు అవినీతి ఆరోపణల అంశాల్లో మంత్రులు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు సంధించినా.. వాటిని వారు వ్యూహాత్మకంగానే దాటవేస్తుంటారు.  అలాంటిది అడగకుండానే ముఖ్యమంత్రి జగన్ పేరుని పెద్దిరెడ్డి ప్రస్తావించడం ఏంటి? వారిద్దరి మధ్య సమన్వయలోపం వల్ల అలా జరిగింది అనుకోవాలా? లేక వైసీపీలో తలెత్తిన విభేదాలకు నిదర్శనమని భావించాలా? అని రాజకీయ వర్గాలవారు చర్చించుకుంటున్నారు.


   గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తాజా ప్రకటన కూడా జగన్‌ సర్కార్‌ని ఇరకాటంలో పెట్టేదిగానే ఉంది. పేదలకి పంపిణీ చేయడం కోసం జగన్‌ ప్రభుత్వం ఇళ్లస్థలాల కొనుగోలు చేపట్టిన సంగతి విదితమే. అయితే ఈ వ్యవహారంలో అవినీతి జరుగుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఆవభూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. అధికారపక్ష ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆయనే ఆ ప్రకటన చేయడం సంచలనం రేపింది. ఇదిలా ఉండగానే.. ఇప్పుడు స్వయంగా మంత్రి శ్రీరంగనాథరాజు ఆశ్చర్యకర ప్రకటన చేశారు. పేదల ఇళ్లస్థలాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని మొట్టమొదట తానే చెప్పానని రంగనాథరాజు గొప్పలు పోయారు. నిజానికి ఈ మాట చెప్పడం అంటే అవినీతి జరిగిందని స్వయంగా మంత్రివర్యులే ఒప్పుకున్నట్టు కదా..? అలా చెప్పడం అంటే జగన్‌ సర్కార్‌కి తలవంపులే కదా? ఒక రాష్ట్ర మంత్రి అయ్యుండీ.. ఇలా బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తే ఎలా? ఈ అంశం కూడా ఇప్పుడు పొలిటికల్‌ ఎనలిస్టుల మధ్య చర్చకి దారితీస్తోంది. ఈ ఉదంతాలన్నీ చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తన పార్టీ నేతలపై పట్టుకోల్పోయారన్న భావన మరింత బలపడుతోంది!

Read more