వెలంపల్లి ఇంట్లోనే వెండి సింహాలు!
ABN , First Publish Date - 2020-09-20T09:07:42+05:30 IST
బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో మాయమైన వెండి సింహం ప్రతిమలు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాయని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఒక తాంత్రికుడి సూచనతో మంత్రి వాటిని

తాంత్రికుడు చెప్పడంతో తీసుకెళ్లారు: టీడీపీ నేత బుద్దా వెంకన్న
విజయవాడ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో మాయమైన వెండి సింహం ప్రతిమలు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాయని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఒక తాంత్రికుడి సూచనతో మంత్రి వాటిని తన ఆధీనంలో ఉంచుకున్నారని చెప్పారు. ఆలయ ఈవో కేవలం నిమిత్త మాత్రుడేనన్నారు. ఈవో, వెలంపల్లి ఫోన్ సంభాషణల కాల్ లిస్ట్ బయటకు తీస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. పవిత్రమైన దుర్గగుడిని మంత్రి వెలంపల్లి దోపిడీ కేంద్రంగా మార్చుకున్నారని, డమ్మీ ఈవోను నియమించుకుని తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. వెలంపల్లిని కట్టడి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనన్నారు. ఆయన తనకేమీతెలియనట్టుగా మంత్రుల అవినీతిని, తప్పులను సమర్థిస్తుంటే ఆయనకే చేటన్నారు.
మంత్రి తన తప్పు తెలుసుకొని, తన ఇంట్లోని సింహపు ప్రతిమలను అమ్మవారి గుడిలో అప్పగిస్తే మంచిదని హితవు పలికారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, బఫూన్ అయిన వెలంపల్లి శ్రీనివాస్ నేడు మంత్రిగా మారాడని బుద్దా వెంకన్న విమర్శించారు. దుర్గమ్మ దేవస్థానంలో ఆభరణాలు ఎన్ని ఉండేవో, ఇప్పుడెన్ని ఉన్నాయో ఈవో మీడియా ముఖంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.