ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...

ABN , First Publish Date - 2020-07-15T22:14:05+05:30 IST

ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...

అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందతున్న అర్హులకు సైతం ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నాని.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. నాడు-నేడు పథకం ద్వారా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించే కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా రూ. 920 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. మరో రూ.250 కోట్లు రెండో విడత కార్యక్రమానికి కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.


జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై కమిటీ ఏర్పాటు..

రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి నాని వెల్లడించారు. ఈ కమిటీలో సీఎస్, సీసీఎల్ఏ, జీఏడీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ కన్వీనర్‌గా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారని, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పర్యవేక్షణను కన్వీనర్ చూస్తారని వివరించారు. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని మంత్రి చెప్పారు. వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేసేందుకు ఏపీఆర్‌డీఎంపీడీసీఎల్ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు అవసరమైతే కేంద్రాన్ని ఒప్పిస్తామని మంత్రి చెప్పారు.


ఇక శ్రీకాకుళం, ఒంగోలులో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సీపీఎస్ రద్దు కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగులపై నమోదైన కేసులను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో గుంటూరులో ముస్లిం యువకులపై నమోదు అయిన కేసులను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఫిష్ ఫీడ్ కంట్రోల్ యాక్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రైతులకు మేలు చేసేలా చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఆక్వా ఫీడ్ ధర నియంత్రణ కోసం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి చెప్పారు. ఇక కర్నూలు జిల్లాలో పాపిలిలో గొర్రెల పెంపక కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. త్వరలోనే అనంతపురం జిల్లాలో మరొక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు.


ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు...

రాష్ట్రంలో ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. మైనింగ్ శాఖ ద్వారా ఈ కార్పొరేషన్ నడుస్తుందని వివరించారు. అదేవిదంగా రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో 9712 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింద్నారు. ఈ 9712 ఉద్యోగాల్లో 5701 ఉద్యోగాలు ప్రభుత్వం కొత్తగా సృష్టించినవేనని పేర్కొన్నారు. అదేవిధంగా ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే 57.5 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. గత ఏదేళ్ల సగటుతో పోలిస్తే 111 శాతం వ్యవసాయం సాగులోకి వచ్చిందన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా 12.51 లక్షల మంది రైతులకు విత్తనాలను అందించామని మంత్రి వివరించారు.

Updated Date - 2020-07-15T22:14:05+05:30 IST