ఇసుక పాలసీ పటిష్ట అమలుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-04-28T14:34:01+05:30 IST
ఇసుక పాలసీ పటిష్ట అమలుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాకు ఇసుక పర్యవేక్షణాధికారులు (డీఎస్ఓ)గా మైనింగ్ అధికారులు నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్యవేక్షించారని... అయితే ఇసుక పాలసీలో పారదర్శకతను మరింత పెంచడానికి కీలకమైన ఈ స్థానాల్లో పూర్తి స్థాయి మైనింగ్ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు.
ఏడీ, డీడీ స్థాయి అధికారుల నియామకంతో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావించినట్లు పేర్కొన్నారు. ఏపీఎండీసీ, మైనింగ్ శాఖల మధ్య సమన్వయంతో ఇసుక విక్రయాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అక్రమాలకు అవకాశం లేకుండా పక్కా ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.