ఆంధ్రజ్యోతి ‘ముఖ్యనేత’ అంటే.. జగన్ పేరు చెప్పిన మంత్రి!

ABN , First Publish Date - 2020-06-22T09:34:18+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో లేటరైట్‌ మైనింగ్‌ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ‘అధికార ఆయుధంతో

ఆంధ్రజ్యోతి ‘ముఖ్యనేత’ అంటే.. జగన్ పేరు చెప్పిన మంత్రి!

  • బెదిరింపుల అంశాన్ని మరుగుపరిచే యత్నం 
  • అవాస్తవాలతో అసలు విషయం దాటవేత 

కాకినాడ, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలో లేటరైట్‌ మైనింగ్‌ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ‘అధికార ఆయుధంతో బెదిరింపుల బిజినెస్‌... ఏడాదికి రూ.180కోట్లు’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనంపై తిరుపతిలో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. వాస్తవాలను మరుగున పెడుతూ, మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే లీజులిచ్చారని చెప్పినప్పటికీ, ఆ లీజుదారుడిని బెదిరించి దారికి తెచ్చుకున్నారా... లేదా... అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఏడాదిలో లేటరైట్‌ వినియోగం 8- 10లక్షల టన్నులు మాత్రమే అని పేర్కొనడం ద్వారా వినియోగం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు.


వంతాడ గనుల్లో తవ్వే లేటరైట్‌ను కేవలం సిమెంట్‌ కంపెనీలకే కాదు. ఒడిశాలోని వేదాంత, జిందాల్‌ ఫ్యాక్టరీలకు కూడా తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు నుంచి రైలుమార్గంలో రవాణా అవుతోంది. కాకినాడ డీప్‌ వాటర్‌పోర్టు ద్వారా గతంలో చైనా, హాంకాంగ్‌ దేశాలకు కూడా ఎగుమతి చేశారు. మంత్రి మాత్రం వీటి గురించి మాట కూడా మాట్లాడలేదు. పైగా వంతాడలో ఇంకా మిగిలిన లేటరైట్‌ నిల్వలు 25- 30లక్షల టన్నులు మాత్రమే అని చెప్పారు. గనుల్లో ఎంత నిల్వ ఉందనేది తవ్వితేనే తేలుతుంది కానీ లీజుకాలం పూర్తికాకుండా మొత్తం 25- 30లక్షల టన్నులే ఉందని మంత్రి ఎలా చెబుతున్నారనేది అర్థం కాని ప్రశ్న. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే... లీజుదారుడి కంపెనీ తన 8 లీజులకు గాను వి.వీర్రాజు పేరుతో పొందిన 10 హెక్టార్ల లీజులో తాము 2014- 19 డిసెంబరు పూర్తయ్యేసరికి తవ్వగా, ఇంకా ఇందులో 37,25,330 లక్షల టన్నుల లేటరైట్‌ నిల్వ రిజర్వ్‌ ఉందని మైనింగ్‌ ప్లాన్‌లో అధికారికంగా ప్రస్తావించింది.


ఈ లెక్కన మిగిలిన ఏడు లీజుల్లో ఇంకా ఎన్ని కోట్ల టన్నుల లేటరైట్‌ నిల్వ ఉందో అంచనా వేయొచ్చు. లేటరైట్‌ టన్ను ధర విషయంలోనూ మంత్రి తక్కువ చేసి చూపించారు. ఇంకా పర్మిట్లు, అనాలసిస్‌ అంటూ సాకులు చెప్పుకొచ్చారు. అయితే 2014 నుంచీ తవ్వుతున్న లేటరైట్‌కు కొత్తగా అనాలసిస్‌ ఎందుకో చెప్పలేదు. ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో ముఖ్యనేత.. ముఖ్యనేతలు అని రాసిందే గానీ సీఎం జగన్‌ అని ఎక్కడా రాయలేదు. అయినా ముఖ్యనేత అంటే మంత్రిగారు మాత్రం సీఎం జగన్‌ పేరు ఎందుకు ప్రస్తావించారో ఆయనే చెప్పాలి. 

Updated Date - 2020-06-22T09:34:18+05:30 IST