మైనింగ్‌లో మా ప్రమేయం లేదు

ABN , First Publish Date - 2020-06-22T09:32:36+05:30 IST

లేటరైట్‌ మైనింగ్‌లో తమ ప్రభుత్వ ప్రమేయమేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మైనింగ్‌లో మా ప్రమేయం లేదు

మాపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి


తిరుపతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): లేటరైట్‌ మైనింగ్‌లో తమ ప్రభుత్వ ప్రమేయమేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అధికార బలంతో తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్‌ మైనింగ్‌లో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారంటూ ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లేటరైట్‌ గనుల్లో ఏడాదికి రూ.180కోట్లు దోచేస్తున్నామని చెప్పడం సత్యదూరమన్నారు.


మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం లింగంపల్లి రిజర్వు ఫారెస్టులో 9 లీజులకు అనుమతి ఇచ్చారన్నారు. వీటిలో 8 అటవీ భూములు కాగా, ఒకటి పట్టాభూమి ఉందన్నారు. ఇప్పటివరకు కోటి టన్నుల లేటరైట్‌ మాత్రమే వెలికితీసినట్లు చెప్పారు. టన్ను రూ.950- 1,150 మాత్రమే ధర ఉంటే, రూ.180కోట్లు దోచేశారని ఎలా రాస్తారని మంత్రి ప్రశ్నించారు. లేటరైట్‌ లీజు హక్కులను 2013- 33వరకు ఎ.శ్రీనివాస్‌, వీర్రాజు, వెంకట రజిని, ఎ.ఉషారాణి, ఎం.వెంకటేశ్వరరావు, సత్యవతి, రమేశ్‌బాబు, ఎ.సుజాత.. 2014-34 వరకు కూడె లక్ష్మి దక్కించుకున్నారన్నారు. ఇంకా 25-35 లక్షల టన్నుల లేటరైట్‌ మాత్రమే ఉంటుందన్నారు. ప్రధానంగా సిమెంట్‌ ఫ్యాక్టరీలో వాడే లేటరైట్‌ను రాష్ట్రంలో 8-10లక్షల టన్నులే వినియోగిస్తారని వివరించారు.


నిబంధనల మేరకు బాక్సైట్‌ను కేంద్రప్రభుత్వం వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుందన్నారు. దీంతో శాంపిల్స్‌ను కెమికల్‌ అనాలసి్‌సకు పంపగా, అది బాక్సైట్‌ కాదని, లేటరైట్‌ అని తేలడంతో మే నెల నుంచి అనుమతులిచ్చామన్నారు. అంతేగానీ గనుల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ముఖ్యనాయకుడి అనుచరులు జులుం చేస్తున్నారంటే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని, గనుల విషయంలో సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఇది పూర్తిగా గనులశాఖ పరిధిలోనే ఉంటుందన్నారు. సరస్వతి పవర్‌ రెన్యువల్‌ అంశంలోనూ నిరాధార ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తున్నామన్నారు. ఒక పద్ధతి ప్రకారం తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-06-22T09:32:36+05:30 IST