ఆ బెంజి కారు నా కుమారుడిది కాదు: మంత్రి జయరాం

ABN , First Publish Date - 2020-09-18T20:44:17+05:30 IST

ఆ బెంజి కారు తన కుమారుడిది కాదని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు.

ఆ బెంజి కారు నా కుమారుడిది కాదు: మంత్రి జయరాం

కర్నూలు: ఆ బెంజి కారు తన కుమారుడిది కాదని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ వేరే వాళ్ల కారు పక్కన తన కుమారుడు ఫొటో దిగాడని చెప్పారు. హెలికాఫ్టర్ దగ్గర, ట్రైన్ దగ్గర ఫొటో తీసుకుంటే మనది అవుతుందా? అని ప్రశ్నించారు.


ఆ కారు తమదేనని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జయరాం సవాల్ చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాయల పకీర్‌లాంటి వారని మంత్రి జయరాం విమర్శించారు.


అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు

’‘మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు, ఇప్పటికే ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ గిఫ్ట్ ఇచ్చారు. ఖరీదైన బెంజ్ కారును మంత్రి కుమారుడికి పుట్టినరోజున సందర్భంగా ఇచ్చారు. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ కార్తీక్‌ ఇచ్చారు. ఏ సంబంధంతో కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి. ఏ 14 మంత్రి జయరాంకు బినామీ. అది పుట్టినరోజు కానుక కాదు...మంత్రికి ఇచ్చిన లంచం’’అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-09-18T20:44:17+05:30 IST