చెప్పుచ్చుక్కొడతా!

ABN , First Publish Date - 2020-12-03T08:41:51+05:30 IST

‘చెప్పిచ్చుక్కొడతా..’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, బుద్దా నాగజగదీశ్వరరావు గురించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు శాననమండలిలో

చెప్పుచ్చుక్కొడతా!

టీడీపీ ఎమ్మెల్సీలపై మంత్రి బొత్స ఫైర్‌ 

మంత్రి మాటలతో మండలిలో దుమారం 

అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం 

విపక్ష ఎమ్మెల్సీలపైకి దూసుకెళ్లిన బొత్స

వీధిరౌడీల్లా కొందరు మంత్రుల ప్రవర్తన: దీపక్‌రెడ్డి 


అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘చెప్పిచ్చుక్కొడతా..’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, బుద్దా నాగజగదీశ్వరరావు గురించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు శాననమండలిలో పెను దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు రేగాయి. ఒకదశలో ఇరుపక్షాల సభ్యులు ఒకరిపై మరొకరు చేయి చేసుకుంటారేమోనన్న పరిస్థితి నెలకొంది. బుధవారం శాసనమండలి ప్రారంభ సమయంలో వాయిదా తీర్మానాలు తిరస్కరించిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. దేవదాయ శాఖ మంత్రి సభలో తనను ఉద్దేశించి మంగళవారం చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఎవరు, ఏం మాట్లాడారో రికార్డులు పరిశీలించాలన్నారు. అంగవైకల్యాన్ని ఎత్తిచూపడం చట్టవ్యతిరేకమని, మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని యనమల రామకృష్ణుడు అన్నారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. రికార్డులు పరిశీలించి మాట్లాడతానన్నారు. ఆయన రికార్డులు పరిశీలించడానికి వెళ్తుం డగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి లేచి.. కొందరు మంత్రులు సభలో వీధి రౌడీలకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. దీంతో మంత్రి బొత్స.. మంత్రులను వీధి రౌడీలు అంటావా? చెప్పిచ్చుక్కొడతా... అంటూ దీపక్‌రెడ్డి వైపు వేలు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ సమ యంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు కలుగజేసుకోవడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.


కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం అనంతరం దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావు వైపు బొత్స దూసుకొచ్చారు. దీంతో నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుంటూ.. ‘‘నోర్ముయ్‌.. చెప్పిచ్చుకుని కొడితే కొట్టించుకోవడానికి ఎవరూ లేరిక్కడ’’ అన్నారు. రా చూసుకుందాం.. అంటూ దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావు కూడా బొత్స వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బొత్సను మరో మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆపే ప్రయత్నం చేశారు. నాగజగదీశ్వరరావును టీడీపీ ఎమ్మెల్సీలు జనార్దన్‌ తదితరులు అడ్డుకున్నారు.  


మాటలను వెనక్కి తీసుకొన్న మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సీ వైవీబీ

శాసనమండలిలో మంగళవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసా ద్‌ వ్యక్తిగతంగా దూషించుకున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం శాసనమండలి చైర్మన్‌  షరీఫ్‌... ఇరువురు సభ్యులు చేసిన వ్యాఖ్యల రికార్డులను పరిశీలించారు. అనంతరం వారిని చాంబర్‌లోకి పిలిపించి మాట్లాడారు. మండలిలో మంత్రి వెలంపల్లి.. ‘‘నేను సభలో మాట్లాడిన మాటలు ఏ సభ్యుడికైనా విచారం కలిగిస్తే ఉపసంహరించుకొంటున్నా’’ అని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ వైవీబీ.. ‘‘నేను అన్నమాటలు సభలో ఏ సభ్యుడికైనా బాధ కలిగించి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఉపసంహరించుకుంటున్నా’’ అని చెప్పారు. 


అధికారంతో వైసీపీ రౌడీయిజం: టీడీపీ 

‘నోరున్న వాళ్లదే రాజ్యం. అధికారమున్నోడిదే రౌడీయిజం అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. అధికార ప్రతినిధి దివ్యవాణి మీడియాతో మాట్లాడారు. ‘‘తండ్రి వయసున్న ప్రతిపక్ష నేతని బుర్ర ఉందా! అంటున్న ముఖ్యమంత్రికి అసలు మనసుందా? అసెంబ్లీ దేవాలయమంటూనే, తండ్రి వయసున్న ప్రతిపక్ష నేతని అనరాని మాటలనడం దుర్మారం’’ అని విమర్శించారు.  

Updated Date - 2020-12-03T08:41:51+05:30 IST