రాజధాని గ్రామాల్లో బొత్స పర్యటన

ABN , First Publish Date - 2020-06-21T09:15:55+05:30 IST

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం రాజధాని ..

రాజధాని గ్రామాల్లో బొత్స పర్యటన

కరకట్టపై కట్టడాలతోపాటు పలు నిర్మాణాల పరిశీలన


తుళ్లూరు, అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం రాజధాని ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించారు. ఏపీసీఆర్డీయే కమిషనర్‌ పి.లక్ష్మీనరసింహం, స్పెషల్‌ కమిషనర్‌ వి.రామమనోహరరావు, సీఈ జక్రయ్య తదితర ఉన్నతాధికారులతో కలిసి సుమారు 3 గంటలపాటు ఆయన ఈ పర్యటన జరిపారు. కృష్ణానది కరకట్టపై 12-13 కిలోమీటర్లు ప్రయాణించి కరకట్టకు ఇరువైపుల ఉన్న పాత కట్టడాలను, అమరావతి ప్రకటన అనంతరం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించింది. ఆతర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలతో అర్ధంతరంగా ఆగిపోయిన పలు ప్రాజెక్టులను పరిశీలించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. సోమవారం కూడా బొత్స పర్యటిస్తారని తెలిసింది. 


కీలక నిర్ణయాలకు ఆస్కారం?!

మంత్రి పర్యటన నేపథ్యంలో అమరావతికి సంబంఽధించిన ఏదో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునేందుకు సమాయత్తమవుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కార్యనిర్వాహక రాజధానిని సాధ్యమైనంత త్వరగా విశాఖపట్నానికి తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి... ఆ నిర్ణయానికి కోర్టుల్లో ఎలాంటి ప్రతిబంధకాలూ తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో మంత్రి బొత్సతో ఈ ప్రక్రియనంతటినీ జరిపిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.


3 రాజధానుల వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందంటూ దాదాపు 185 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు సాంత్వన కలిగే కొన్ని చర్యలను తీసుకున్నట్లయితే వారు కొంతైనా మెత్తపడతారని, కోర్టులు కూడా సానుకూలంగా ఉంటాయన్నది ప్రభుత్వ అభిప్రాయమంటున్నారు. అందులో భాగంగానే రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వారికిచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి, ఇంకొన్ని కీలక ప్రాజెక్టుల వరకూ పూర్తి చేయాలని భావిస్తోందని, అందుకోసమే బొత్స ప్రయత్నాలు, పర్యటనలని సమాచారం. 

Updated Date - 2020-06-21T09:15:55+05:30 IST