మంత్రులు వీధిరౌడీల్లా ప్రవర్తించారు
ABN , First Publish Date - 2020-06-18T08:50:55+05:30 IST
శాసనమండలిలో వైసీపీ మంత్రులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. పెద్దల సభలో మంత్రి అనిల్‌కుమార్ తొడకొట్టడం, జిప్ తీయడం.. తీవ్ర దూషణలకు దిగడం.. మరో మంత్రి ప్రతిపక్ష టీడీపీ
అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో వైసీపీ మంత్రులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. పెద్దల సభలో మంత్రి అనిల్‌కుమార్ తొడకొట్టడం, జిప్ తీయడం.. తీవ్ర దూషణలకు దిగడం.. మరో మంత్రి ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై దాడికి దిగడం వంటి ఘోరాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. సభలో జరిగిన ఘటన వీడియోలు ఎడిట్ చేయకుండా విడుదల చేయాలని ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. మండలిలో మంత్రులు భాష వింటే ప్రజలు వారిని గ్రామాల్లోకి రానివ్వరని బుద్దా నాగజగదీశ్వరరావు అన్నారు. మంత్రులపై దాడి జరిగిందంటున్న ప్రభుత్వం వీడియో ఫుటేజీలను బయట పెట్టాలని దీపక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రులే ప్రతిపక్ష సభ్యుల వైపు వచ్చి దాడి చేశారని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని ఉదయం నుంచి తాము ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వమే పథకం ప్రకారం వాయిదా వేసిందని గౌరివాని శ్రీనివాసులు ఆరోపించారు. 12 మంది మంత్రులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని బచ్చుల అర్జునుడు చెప్పారు. దాడికి వస్తుంటే లోకేశ్ చేతులు అడ్డుపెట్టారని.. ఆయన సభలో ఫొటోలు తీశారంటూ అబద్దమాడారని, బూతులతో అనరాని మాటలు అన్నారని మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లు పెట్టేందుకు ఆర్ధిక మంత్రి బుగ్గన సిద్ధమైనా మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన్ని ఆపారని అశోక్‌బాబు చెప్పారు.