ఆ జిల్లాల ప్రజలతోనే శభాష్ అనిపించుకుంటారు: అవంతి

ABN , First Publish Date - 2020-07-14T23:36:57+05:30 IST

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో ఏడు పర్యాటక ప్రాంతాలలో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లను పెట్టాలనుకుంటున్నామని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..

ఆ జిల్లాల ప్రజలతోనే శభాష్ అనిపించుకుంటారు: అవంతి

అమరావతి: పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో ఏడు పర్యాటక ప్రాంతాలలో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లను పెట్టాలనుకుంటున్నామని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. టూరిజం, కల్చర్, శిల్పా రామంపై రివ్యూ చేశామని చెప్పారు. జూన్30 నాటికి టూరిజం స్పాట్లలో హోటళ్లను రిపేర్ చేస్తామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను ప్రారంభిస్తామని చెప్పారు. కల్చరల్ డిపార్ట్‌మెంట్ నుండి ప్రముఖుల జయంతి, వర్థంతి లను 50 మందితో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తామని అన్నారు. పర్యాటక శాఖకు నెలకు రూ.10 కోట్ల చొప్పున రూ.60 కోట్లు నష్టం వచ్చిందన్నారు.


ఇదే సమయంలో విశాఖ రాంకీ ప్రమాదంపై మంత్రి అవంతి స్పందించారు. విశాఖపట్నంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం అన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ప్రమాదానికి గురయ్యాక ఎంత నష్ట పరిహారాన్ని ఇచ్చినా లాభం లేదన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పరిశ్రమలు నిర్వహించాలని మంత్రి సూచించారు. 


సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని, ఆ నేపథ్యంలోనే దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కొన్ని వర్గాలను చూసి మాత్రమే మేలు చేసేవారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వం అని, వివక్ష, అవినీతి లేకుండా పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్ల తరువాత మళ్లీ ఏర్పాటు ఉద్యమాలు రాకూడదనే ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మంత్రి అవంతి చెప్పుకొచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వారితోనే‌ శభాష్ అనిపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటుందన్నారు.

Updated Date - 2020-07-14T23:36:57+05:30 IST