మంత్రి అనిల్‌‌కుమార్‌కు సెగ.. పగబట్టిన నెల్లూరు పెద్దారెడ్లు

ABN , First Publish Date - 2020-06-04T16:28:16+05:30 IST

మంత్రి అనిల్‌‌కుమార్‌కు సెగ.. పగబట్టిన నెల్లూరు పెద్దారెడ్లు

మంత్రి అనిల్‌‌కుమార్‌కు సెగ.. పగబట్టిన నెల్లూరు పెద్దారెడ్లు

నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరుతున్నాయా? మంత్రులంటే ఎమ్మెల్యేలకు ఎందుకు సరిపడటం లేదు? అందరినీ కలుపుకుపోవడంలో మంత్రి అనిల్ ఫెయిల్ అయ్యారా? నెల్లూరు పెద్దరెడ్లు మంత్రి అనిల్‌పై ఎందుకని గుర్రుమంటున్నారు? నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటించకపోవడానికి కారణాలేంటి? జిల్లాలోని ఇద్దరు మంత్రుల గురించి జనం ఏమంటున్నారు? ఎమ్మెల్యేల్లోనూ ఒకరంటే మరొకరికి ఎందుకని గిట్టడం లేదు? కరోనా సమీక్ష సమావేశాల్లో వారికి ఇచ్చిన ప్రాధాన్యమేంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.


  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటనే చెప్పాలి. గత ఎన్నికల్లో పది నియోజకవర్గాలకి పదింటిలోనూ వైసీపీనే గెలిచింది. నెల్లూరు, తిరుపతి ఎంపీ స్థానాలూ ఆ పార్టీకే వచ్చాయి. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలు, రెండు ఎంపీ స్థానాలూ వైసీపీవే. అందుకే వైసీపీ వర్గీయులు తమ పార్టీకి నెల్లూరులో చిటికేస్తే సీట్లు వస్తాయంటూ గొప్పలు పోతుంటారు. అయితే ఇప్పుడా కంచుకోటలో సొంత పార్టీలోనే విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా లోలోన ప్రజాప్రతినిధులు, నేతల మధ్య పగలు రగలుతున్నాయి. ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకుంటున్నా.. జనం మాత్రం చర్చించుకుంటూనే ఉన్నారు. మంత్రులంటే ఎమ్మెల్యేలకి అస్సలు గిట్టడం లేదు. ఎడ్డమంటే తెడ్డమంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమ నియోజకవర్గాల్లో తామే రాజు.. తామే మంత్రి అన్నచందంగా పరిస్థితులు ఉన్నాయి. 


    నిజానికి నెల్లూరు పెద్దరెడ్లుకి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటే వీరాభిమానం. అన్నిరంగాల్లో ఉన్నవారంతా గత ఎన్నికల్లో ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని తపించారు. ఇతర పార్టీలతో ఉన్న అనుబంధాలు, వాటిలోని నేతలతో స్నేహాలు పక్కనపెట్టి వైసీపీ గెలుపుకోసం అవిరామంగా కృషి చేశారు. పార్టీ భారీ మెజారిటీతో గెలిచాక సింహపురిలో తమ సామాజికవర్గానిదే పెత్తనమని మురిసిపోయారు. తీరా ముఖ్యమంత్రి జగన్.. అనిల్ కుమార్ కి మంత్రి పదవి ఇవ్వడాన్ని, జిల్లాలో పెత్తనమంతా ఆయనకే అప్పగించడాన్ని తొలుత వారు జీర్ణించుకోలేకపోయారు. తర్వాత సర్దుకుపోయేందుకు ప్రయత్నించారు. కానీ ఎడ్జస్ట్ అవడంలో వారికి ఎదురుదెబ్బలు తప్పలేదు. సరే.. సీఎం మనవాడే కదా... నేరుగా వెళ్లి పనులు చేయించుకోవచ్చని పెద్దరెడ్లు అనుకున్నారు. అయితే ఆ విషయంలోనూ భంగపాటు తప్పలేదు. అసలు చాలా మందికి కనీసం సీఎం అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. ఏదైనా పనుల కోసం మంత్రి అనిల్ కుమార్ వద్దకి వెళ్లినా అంత ఈజీగా పనులు కావడం లేదట. అదే విషయాన్ని మంత్రి అనిల్ కి చెబితే- "ఎవరన్నా చెప్పింది... ఆ ఇద్దరు ముగ్గురే రెడ్లు కాదు... మా వెనుక చాలామంది రెడ్లు ఉన్నారు" అని ఆయన అంటున్నారని వినికిడి.


   గతంలో ఎవరు మంత్రిగా ఉన్నా.. వారి కాన్వాయ్ లో పెద్దారెడ్ల కార్లు బారులు తీరేవి. ఇప్పుడు అసలా ఆ సీన్ లేకుండా పోయింది. మంత్రుల పీఏలు సైతం పోలీసు వాహనాల్లో రాకపోకలు సాగిస్తూ ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెద్దారెడ్లలో ఎక్కువ మంది కాంట్రాక్టులు చేస్తుంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమ పని తాము చేసుకుపోతూ నాలుగు రాళ్లు వెనుకేసుకుంటూ ఉండేవారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులన్నింటికీ బిల్లులు ఆపేయడంతో చాలామంది అప్పులు చేసి మరీ పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక, బిల్లుల కోసం తిరగలేక, కొత్తగా పనులు చేయాలంటే బెదిరింపులు తప్పక.. లోలోన కుమిలిపోతున్నారు. కొందరైతే బహిరంగంగానే "తప్పు చేశాం.. తప్పు చేశాం.. తప్పు చేశాం.." అని పదేపదే అంటుండటం గమనార్హం.


  ఇదిలాఉంటే.. మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డిలు అంటే జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలకు గిట్టడం లేదట. ఇప్పటివరకూ మంత్రులు ఒక్కో నియోజకవర్గంలో ఒకటీ, రెండుసార్లు మినహా పర్యటించలేదు. అలాగే ఒకట్రెండు నియోజకవర్గాల్లో అయితే అసలు ఇప్పటికీ అడుగు కూడా పెట్టలేదు. కొందరు ఎమ్మెల్యేలైతే- "ఆ.. ఆయనేందయ్యా.. మంత్రి.. సరేలే.." అంటూ అందరిముందే తక్కువగా మాట్లాడుతున్నారట. మంత్రి అనిల్ లో  ఓకింత గర్వం వల్లనే అందర్నీ కలుపుకుపోలేకపోతున్నారనే చర్చలు జిల్లాలో జోరుగానే సాగుతున్నాయి. ఎమ్మెల్యేలకు, మంత్రులకు గిట్టకపోవడం వల్లనే.. ఇటీవల అంతలా కరోనా జిల్లాపై విరుచుకుపడ్డ సమయంలోనూ, ఎమ్మెల్యేలతో, మంత్రులు సమావేశం నిర్వహించలేదని అంటున్నారు. మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటి? ఏం చేయాలి? కరోనాని నివారించడానికి మీరేం సలహా ఇస్తారని ఎమ్మెల్యేలని మంత్రులు అస్సలు అడగకపోవడం కూడా వారిని బాధించిందట. "ఏం.. అంత మాత్రం సలహాలు, సూచనలు మేమివ్వలేమా?.." అని కొందరు తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఇక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని అయితే అస్సలు పట్టించుకునేవారే లేరని జిల్లాలో చర్చ జరుగుతోంది.


   ఇక జిల్లాలో ఎమ్మెల్యేల్లో ఎమ్మెల్యేలకే పడటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేల్లోనూ విభేదాలు ఉన్న విషయం స్సష్టం చేశాయి. సోమశిల నుంచి రెండవ పంటకి సాగునీరు ఇస్తున్నట్టు స్వయానా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. ఇంతలో అధికారులు ఉన్నట్టుండి.. ఒక్కరోజు రాత్రికిరాత్రి పదివేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఆ విషయంపై ప్రసన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "నాన్ డెల్టాకి నీరు ఎందుకు వదిలారు? డబ్బులు తీసుకునే నీరు వదిలారు.. అధికారుల వెనుక ఉన్న నేత ఎవరో బయటపెట్టాలి" అని ఆయన డిమాండ్ చేశారు. తీరా చూస్తే... ఆ వెనుకున్నది అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేనేనట. అందులోనూ జలవనరులశాఖ మంత్రి సొంత జిల్లాలోనే నీటిని అమ్ముకున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రసన్న చేసిన వ్యాఖ్యలు.. అటు ప్రభుత్వానికి, ఇటు మంత్రి అనిల్ కి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డిల మధ్య విభేదాలు వస్తే.. పార్టీ పెద్దలు అమరావతిలో సెటిల్ చేశారు. వైసీపీ శ్రేణుల్లోనూ వర్గాలు తయారవుతున్నాయి. అవి మంత్రులకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయట. అందుకే చాలామటుకు ఇతర నియోజకవర్గాల్లో పర్యటించడం లేదనే వాదనలూ ఉన్నాయి.


   నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చాన్నాళ్లుగా అంటీముట్టనట్టు.. పట్టీపట్టనట్టుగా ఉంటున్నారు. చాలా మందికి ఆయన రాజకీయ గురువు. రాజకీయాల్లోనూ తలపండిన వ్యక్తి. ఎంపీలు ఎక్కడైనా ప్రజల్లో తిరగాలన్నా.. కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా.. ఎమ్మెల్యేలకి తెలపాలనే రూలుందట. మరోవైపు జగన్ వద్ద ఎంపీలకే అపాయింట్ మెంట్ దొరకడం లేదట. అందుకే ఆదాల బోటి వారంతా పట్టీపట్టనట్టు ఉన్నారంటూ ఆ పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆదాల మాత్రం పార్లమెంట్ పరిధిలో పది ప్రధానమైన సమస్యలపై లోక్ సభలో ప్రశ్నించారు. ఇక తిరుపతి ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ ని కూడా ఎమ్మెల్యేలు అస్సలు లెక్క చేయడంలేదు. గూడూరు నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే వరప్రసాద్ కి, ఆయనకి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎవరికి వారే వర్గాలు నడుపుతున్నారు. సూళ్లూరుపేటలోనూ అదే పరిస్థితి. అక్కడైతే బల్లి దుర్గాప్రసాద్ కి తీవ్ర అవమానం కూడా జరిగింది. దాంతో ఆయన ఓ కార్యక్రమంలో స్టేజీ మీదకి రాలేదు.


   మరోవైపు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అనుచరుల బాధా అంతాఇంతా కాదు. ఆయన కుమారుడు మంత్రి, సోదరుడు ఎమ్మెల్యే.. ఇంకేం బాధయ్యా అంటే... మా పెద్దాయనని వయస్సు అయిపోయిందని ఏ పదవీ లేకుండా కూర్చోబెట్టారు. ఎన్నోసార్లు జగన్ చెప్పగానే ఎంపీ పదవికి రాజీనామా చేసిన నాయకుడాయన. చివరకు రాజ్యసభ ఇస్తామన్నారు. అదీ ఇప్పట్లో ఇచ్చేలా లేరు.. వచ్చేలా లేదు. వైఎస్ఆర్, చంద్రబాబు వంటి వారూ సైతం అన్నా అంటూ గౌరవం ఇచ్చే నేతకు.. ఇప్పుడస్సలు గౌరవమే లేకుండా పోయిందని చర్చిస్తున్నారు. ఇదండీ నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి. ఎవరికి వారే యమనా తీరే అన్నట్టుగా అధికార పార్టీ నేతలు ఉన్నారు. మరిలాగే రాబోయే రోజుల్లోనూ విభేదాలు కొనసాగిస్తే.. మునుపటిలాగానే సీట్లు వస్తాయా..? ప్రజలు విశ్వసిస్తారా..? అంటే.. ఏమో చూద్దాం! 

Updated Date - 2020-06-04T16:28:16+05:30 IST