తిన్నది అరగక టీడీపీ నేతలు దీక్ష చేస్తున్నారు: అనిల్
ABN , First Publish Date - 2020-04-28T18:21:45+05:30 IST
టీడీపీ నేతలు చేపడుతున్న దీక్షలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

అమరావతి : టీడీపీ నేతలు చేపడుతున్న దీక్షలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిన్నది అరగక టీడీపీ నేతలు 12 గంటలు దీక్ష చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత, నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం చంద్రబాబు ఏనాడూ రైతులను ఆదుకోలేదన్నారు. కరోనా కాలంలో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ల్యాబ్‌లను పెంచుతున్నామని.. మరిన్ని టెస్టులు చేస్తామన్నారు.
పక్క రాష్ట్రంలో కూర్చున్న చంద్రబాబుకు రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో ఏపీ అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని.. అన్ని విధాలుగా నియంత్రణ చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా అనిల్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారని మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు.
చేతనైతే ధైర్యాన్ని నింపండి!
కరోనా కిట్ల కొనుగోలుపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయని.. ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని మంత్రి ప్రశ్నించారు. చేతనైతే ప్రజల్లో ధైర్యాన్ని నింపండని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. క్వారంటైన్‌లో అన్ని సదుపాయాలు కల్పిసున్నామన్నారు. కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని అనిల్ తెలిపారు.