-
-
Home » Andhra Pradesh » Minister Anil Kumar Yadav Comments On Polavaram
-
పోలవరంపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2020-10-31T22:44:47+05:30 IST
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కట్టి తీరుతామని వెల్లడించారు. ‘పోలవరం కట్టాల్సిన పూర్తి బాధ్యత కేంద్రానిదే. పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని విభజన చట్టంలో ఉంది. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుంది. పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదే. వైఎస్ హయాంలో చేసిన ప్రాజెక్ట్ పనులనే చంద్రబాబు చెప్పుకున్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరంలో ఇబ్బందులు. కేంద్రం నిధులు ఇచ్చినా.. ఇవ్వకున్నా పోలవరం కట్టితీరుతాం. 2017లో కేబినెట్ మీటింగ్‌లో ఏం జరిగిందో టీడీపీ నేతలు ఎందుకు బయటపెట్టరు?’ అని మంత్రి అనిల్ నిలదీశారు.
ఇంకా ఏమన్నారంటే..
‘పోలవరం ప్రాజెక్టులో కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీలకు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ అంశంపై సీఎం జగన్.. ప్రధానికి లేఖ రాశారు. 2014 విభజన చట్టం ప్రకారం పూర్తిగా కేంద్రమే పోలవరం ప్రాజెక్టు ఖర్చు భరించాలి. 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తాన్ని కూడా చెల్లించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2015-16 లో పీపీఏ 6 సమావేశాలు నిర్వహించి సవరించిన అంచనాలు కోరితే వాయిదాలు వేశారు. 2016 సెప్టెంబర్‌లో 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్‌ను 2014 ధరల ప్రకారం చెల్లిస్తామని చెప్పారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2014 కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును చెల్లించమని కేంద్రం ఆ సమయంలో చెప్పింది. దానికి కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది’ అని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ అసమర్థతే కారణం..
‘2017 మార్చి వరకు కూడా ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది అని గుర్తించలేకపోయిన అసమర్థత గత ప్రభుత్వానిది. పదేపదే పీపీఏ కోరినా వివరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్నే ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా డిసెంబర్ 2021కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం. ఓ కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు ఎందుకు దాచిపెట్టారు. పరిశ్రమలకు నీళ్లు, పవర్ హౌస్ కుకూడా నిధులు కోల్పోవాల్సి వచ్చింది. 2014 కంటే ముందు 5 వేల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసేసింది. ప్రకటించిన గడువు తేదీ నాటికి ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పరిహారాన్ని కూడా పూర్తి చేస్తాం. పునరావాస పరిహారానికి సంబంధించిన కాంపోనెంట్ 65 శాతం ఉంటే 2019 నాటికి కూడా ఒక్కరికి పునరావాసం చేయకుండా 70 శాతం ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుంది. ప్రస్తుతం ఇంకా 1 లక్ష నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసం చెల్లించాల్సి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు.