-
-
Home » Andhra Pradesh » Migrant workers were beaten
-
వలస కార్మికులను కొట్టారు!
ABN , First Publish Date - 2020-05-18T09:49:44+05:30 IST
వలస కార్మికులపై మరోసారి దాడి జరిగింది. శనివారం తాడేపల్లిలో.. సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో వలస కూలీలపై పోలీసు లాఠీలు విరిగిన

- రైలులో తరలిస్తామని చెప్పి.. రద్దు సమాచారం
- ఆందోళనకు దిగిన పశ్చిమ బెంగాల్ కార్మికులు
- పోలీసులు, వైసీపీ నేతలు కొట్టారని ఆరోపణ
- కార్మికులకు సీపీఎం మద్దతు.. నేతల అరెస్టు
- తోట్లవల్లూరు పీఎస్‌కు మధు తరలింపు
- పోలీసులు, వైసీపీ నేతలు కొట్టారని ఆరోపణ
- వలస కూలీలకు ఏ లోటూ రానీయొద్దు: సీఎం
విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి): వలస కార్మికులపై మరోసారి దాడి జరిగింది. శనివారం తాడేపల్లిలో.. సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో వలస కూలీలపై పోలీసు లాఠీలు విరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి ప్రభుత్వ పెద్దలు సైతం.. వలస కూలీలను ఏమీ అనొద్దని, వారు సొంతూళ్లకు వెళ్లేందుకు సహకరించాలని పోలీసులకు హితవచనాలు పలికారు. అయినా.. ఆ బడుగు జీవుల కష్టాలు ఎవ్వరికీ పట్టడం లేదు. వారి వేదన అరణ్య రోదనే అవుతోంది. తాజాగా.. విజయవాడ పటమటలో వలస కార్మికులపై ఆదివారం పోలీసులు లాఠీచార్జి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ నేతలు కూడా వారిపై దాడికి తెగబడడంతో పలువురికి గాయాలయ్యాయి.
పశ్చిమబెంగాల్‌కు చెందిన వందలాది మంది వలస కూలీలు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌లో ఇరుక్కుపోయిన వీరంతా తమను సొంత రాష్ర్టానికి పంపాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సుమారు 300 మందిని కొన్ని రోజులుగా విజయవాడ పటమటలోని రామాలయం వద్ద ఉన్న మూడంతస్తుల భవనంలో ఉంచారు. ఆదివారం ఓ రైలు పశ్చిమబెంగాల్‌కు వెళ్తోందని, ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని సమాచారం రావడంతో అంతా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఉదయం ఎంతసేపటికీ వారిని రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లడానికి వాహనాలు రాకపోవడంతో బందరురోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో నివాసాల నడుమ వలస కార్మికులకు వసతి కల్పించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చారు. భవనంలో ఉన్న కొందరు కార్మికులు రెడ్‌జోన్‌లో ఉన్న పెనమలూరు మండలం సనత్‌నగర్ నుంచి వచ్చారని, వారిని తక్షణం అక్కడి నుంచి ఖాళీ చేయించాలని వారు డిమాండ్ చేశారు. వారిలో కొందరు స్థానిక వైసీపీ నాయకులు వలస కార్మికులతో వాగ్వాదానికి దిగి వారిపై చేయి చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మధ్యాహ్నం నుంచి మారిన సీన్
పరిస్థితి సర్దుకుందనుకుంటుందన్న తరుణంలో మధ్యాహ్నం మళ్లీ కార్మికులంతా ఆందోళనకు దిగారు. కార్మికులకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు రామాలయం వద్దకు చేరుకున్నారు. ఈ ఆందోళనలో మరో ముగ్గురు వలస కార్మికులకు గాయాలయ్యాయి. స్థానికంగా ఉండే వైసీపీ నేతలు కార్మికులపై దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని బాబూరావు డిమాండ్ చేశారు. వలస కార్మికులకు మద్దతు పలికిన సీపీఎం నేత మధుతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి, తోట్లవల్లూరు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. రైలు రద్దు కావడంతో కార్మికుల తరలింపు వీలుకాలేదని పోలీసులు తెలిపారు. వలసకూలీలపై దాడిని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ఖండించారు.