మళ్లీ తెరపైకి ‘మెడ్‌టెక్‌’

ABN , First Publish Date - 2020-12-11T07:36:44+05:30 IST

ఆరోగ్యశాఖలో మెడ్‌టెక్‌ జోన్‌ అంశం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్‌హెచ్‌ఎంకు చెందిన రూ.52 కోట్లను అప్పటి అధికారులు

మళ్లీ తెరపైకి ‘మెడ్‌టెక్‌’

పవర్‌మెక్‌కు 52 కోట్లు మళ్లింపుపై వివాదం 

అందులో 34 కోట్లు వెనక్కు ఇచ్చిన సంస్థ 

మిగిలిన 18 కోట్ల కోసం ఆరోగ్యశాఖ పట్టు 

కంపెనీపై క్రిమినల్‌ చర్యలకు రంగం సిద్ధం? 

న్యాయశాఖ సలహా కోరిన అధికారులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆరోగ్యశాఖలో మెడ్‌టెక్‌ జోన్‌ అంశం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్‌హెచ్‌ఎంకు చెందిన రూ.52 కోట్లను అప్పటి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి, పవర్‌మెక్‌ సంస్థకు బదలాయించారంటూ ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ప్రభుత్వానికి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో రూ.34 కోట్లు మాత్రమే ఆ సంస్థ వెనక్కి ఇచ్చిందని, మరో రూ.18 కోట్లు రావాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఎంకు ఆ మొత్తం వెంటనే తిరిగి ఇవ్వాలని పవర్‌మెక్‌ కంపెనీకి కూడా ఆయన గతంలోనే లేఖ రాశారు. అయితే పరిశ్రమల శాఖ నుంచి తమ సంస్థకు రావాల్సిన బిల్లుల నుంచి ఎన్‌హెచ్‌ఎంకు చెల్లించాల్సిన రూ.18 కోట్లు మినహాయించుకుని, మిగిలిన మొత్తం తమకు ఇవ్వాలని పవర్‌మెక్‌ బదులిచ్చింది.


ఈ సమాధానంతో సంతృప్తి చెందని కమిషనర్‌... పరిశ్రమల శాఖతో ఎన్‌హెచ్‌ఎంకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ, చెల్లించాల్సిన మొత్తం వెంటనే ఇవ్వాలని మరో లేఖ రాశారు. మొదటిసారి చెప్పిన సమాధానాన్నే పవర్‌మెక్‌ ఆ లేఖలోనూ పొందుపరిచింది. ఇలా రెండు నెలలుగా ఆరోగ్యశాఖ, పవర్‌మెక్‌ సంస్థ మధ్య లేఖాస్త్రాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. 2018లో పవర్‌మెక్‌ సంస్థకు ఎన్‌హెచ్‌ఎం నుంచి చెల్లించిన రూ.52 కోట్ల బిల్లులకు సంబంధించిన వివరాలు, ఈమధ్య కాలంలో పవర్‌మెక్‌, ఆరోగ్యశాఖ మధ్య లేఖల ద్వారా జరిగిన సంభాషణలను 4రోజుల క్రితం న్యాయశాఖకు పంపించారు. వాటి ఆధారంగా ఆ కంపెనీపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో చెప్పాలని సలహా కోరారు. దీనిపై సోమవారం నాటికి న్యాయశాఖ అధికారులు సమాధానం ఇవ్వన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్‌హెచ్‌ఎంకు చెందిన రూ.18కోట్ల కోసం ఆరోగ్యశాఖ గట్టిగానే పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమైంది.

Updated Date - 2020-12-11T07:36:44+05:30 IST