ఇంకా ఫిలిప్పీన్స్‌లోనే..

ABN , First Publish Date - 2020-03-19T09:25:17+05:30 IST

ఎంబీబీఎస్‌ చదివేందుకు ఫిలిప్పీన్స్‌ వెళ్లిన తెలుగు విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించడంతో.. భారత్‌కు చెందిన విద్యార్థులు స్వదేశానికి తిరగొచ్చేందుకు విమాన టికెట్లు...

ఇంకా ఫిలిప్పీన్స్‌లోనే..

  • మనీలా ఎయిర్‌పోర్టులో 86 మంది
  • వారిలో 55 మంది తెలుగు వారే
  • రెండు రోజులుగా నిద్రాహారాలు లేవు
  • తిరిగి వర్సిటీకి వెళ్లే అవకాశం లేదు
  • భారత్‌కు రావాలంటే నిబంధనలు అడ్డంకి
  • భయాందోళనలో తల్లిదండ్రులు
  • ఇటలీ, కిర్గిజిస్థాన్‌లో మరికొందరు


రాజమహేంద్రవరం సిటీ, కందుకూరు, మార్చి 18: ఎంబీబీఎస్‌ చదివేందుకు ఫిలిప్పీన్స్‌ వెళ్లిన తెలుగు విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించడంతో.. భారత్‌కు చెందిన విద్యార్థులు స్వదేశానికి తిరగొచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కానీ.. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఆయా దేశాల విమానాలపై భారత్‌ నిలిపివేయడంతో ఇప్పుడు వారంతా మనీలా ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నారు. భారత్‌కు చెందిన 86 మంది విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 35, తెలంగాణ నుంచి 20, తమిళనాడుకు చెందిన 15 మంది రెండు రోజులుగా మనీలా ఎయిర్‌పోర్టులో నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా వారిలో ఉన్నారు. ఫిలిప్పీన్స్‌లో యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించడంతో ఇప్పుడు వారు వెనక్కు తిరిగి వెళ్లలేక.. ఇటు భారత్‌కు రాలేక ఇబ్బంది పడుతున్నారు. మనీలా చిక్కుకుపోయిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వెలమ హరిత ప్రసన్నలక్ష్మి బుధవారం వీడియో కాల్‌ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడింది. ‘ఆంధ్రజ్యోతి’తో తన బాధను పంచుకుంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకూ ఎయిర్‌పోర్టులోనే ఉన్నామని, తమ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంది.


తమను పట్టించుకునే వారు లేరని వాపోయింది. భారత ప్రభుత్వం స్పందించి వెంటనే తమను స్వదేశానికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు కూడా హరితను స్వదేశానికి రప్పించాలని భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా.. ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇటలీ, కిర్గిజిస్థాన్‌ దేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు కూడా ఆయా దేశాల్లో చిక్కుకున్నారు. భారత్‌కు విమానాలు నిలిపివేత, మెడికల్‌ సర్టిఫికెట్లు పొందలేక, ఇతరత్రా కారణాలతో వారంతా అక్కడే చిక్కుకు పోయారు. ఇటలీ, కిర్గిజిస్థాన్‌లో ఉండిపోయిన తమ వారిని వెంటనే స్వదేశం తెప్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-19T09:25:17+05:30 IST