సగం మేయర్లు.. మహిళలకే
ABN , First Publish Date - 2020-03-08T09:36:57+05:30 IST
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

16 మేయర్ పదవులకు రిజర్వేషన్ల ఖరారు.. వార్డుల విభజన 12 కార్పొరేషన్లలోనే
మేయర్లలో ఎస్టీ-1, ఎస్సీ-2, బీసీ-5, మహిళ జనరల్-5, అన్ రిజర్వుడు-3
అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 16 కార్పొరేషన్లలో మేయర్ పదవులకు, 12 కార్పొరేషన్లలో వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారుచేస్తూ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా కార్పొరేషన్లలోని సంఖ్య ఆధారంగా వార్డులను రిజర్వు చేశారు. అయితే ఒక్క కార్పొరేషన్‌లోనూ ఎస్టీ మహిళలకు ఒక్క వార్డును కూడా కేటాయించలేదు. అన్ని కార్పొరేషన్లలో ఎస్టీ కేటగిరీలో జనరల్‌కు మాత్రమే ఒక్కో వార్డు కేటాయించారు. వార్డులతోపాటు మేయర్ పదవులకూ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మున్సిపల్ శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. మొత్తం 16 కార్పొరేషన్ మేయర్లలో ఎస్టీ జనరల్‌కు ఒకటి, ఎస్సీ జనరల్ ఒకటి, ఎస్సీ మహిళకు ఒకటి, బీసీ జనరల్‌కు మూడు, బీసీ మహిళకు రెండు, జనరల్ మహిళకు ఐదు, అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ కింద మూడు స్థానాలను ఖరారు చేశారు.