లొంగుబాటలో మావోయిస్టు నేత గణపతి!

ABN , First Publish Date - 2020-09-01T09:47:39+05:30 IST

మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

లొంగుబాటలో మావోయిస్టు నేత గణపతి!

  • అనారోగ్య కారణాల వల్లే..  

న్యూఢిల్లీ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఆయన అనుయాయులకు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. 74 ఏళ్ల గణపతి గత రెండేళ్ల క్రితమే అనారోగ్య కారణాల వల్ల పార్టీ ఉన్నత పదవి నుంచి తప్పుకొన్నారు. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో తీవ్ర అస్వస్థతతో ఉన్న గణపతిని ఎక్కడికి తీసుకువెళ్లాలన్నా మోసుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ఈ స్థితిలో లొంగిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందక తప్పదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


గణపతి లొంగుబాటును సాఫీగా జరిగేలా చేసేందుకు తెలంగాణ పోలీసులు చొరవ తీసుకుంటున్నారని, ఈ విషయంలో మోదీ సర్కారు కూడా సుముఖంగా ఉందని తెలిసింది. కాగా, జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌లో గోపాల్‌రావు-శేషమ్మ ద ంపతుల రెండో కుమారుడిగా 1950లో లక్ష్మణరావు జన్మించారు. ఆయనకు 1973లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. రుద్రంగిలో పని చేస్తుండగా 1975లో బీఈడీ సీటు రావడంతో వరంగల్‌ వెళ్లారు. అక్కడ ఆర్‌ఎ్‌సయూతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1977లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. ఆతర్వాత ఆదిలాబాద్‌ జిల్లా తపాల్‌పూర్‌లో పితంబర్‌రావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జగిత్యాల జైత్రయాత్ర కోసం చందాలు వసూలు చేశారనే కేసు, ఉప్పుమడిగె రాజేశ్వర్‌రావు, చిన్నమెట్‌పల్లి జగన్మోహన్‌రావు హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి. కరీంనగర్‌లో బెయిల్‌ తీసుకుని పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1990-91లో పీపుల్స్‌వార్‌ పార్టీలో చీలికలు రాగా, నూతనంగా ఏర్పడ్డ మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 

Updated Date - 2020-09-01T09:47:39+05:30 IST