రాజీకి రాలేదని ‘మంట’

ABN , First Publish Date - 2020-09-03T07:43:46+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ దళిత యువతికి మాయమాటలు చెప్పాడు.

రాజీకి రాలేదని  ‘మంట’

దళిత యువతి ఇంటికి 

నిప్పంటించిన దుండగులు

ప్రేమ పేరిట వంచించాడంటూ ఫిర్యాదు

కేసు వాపసు తీసుకోలేదంటూ ఆగ్రహం

కృష్ణా జిల్లాలో దారుణం

 

ముదినేపల్లి, సెప్టెంబరు 2: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ దళిత యువతికి మాయమాటలు చెప్పాడు. చివరికి... మోసం చేశాడు. కేసు పెట్టారన్న కక్షతో... ఏకంగా బాధితురాలి ఇంటికే నిప్పంటించారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... నర్సింగ్‌ చేస్తున్న ఒక దళిత యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ముదినేపల్లి మండలం వడాలికి చెందిన సాయి రెడ్డి అనే యువకుడు నమ్మబలికాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. యువతి కుటుంబ సభ్యులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అయితే... నిందితుడి తరఫున కొందరు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ‘రాజీకి రండి. కేసు వాపస్‌ తీసుకోండి’ అంటూ బాధిత యువతి కుటుంబంపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. వారు ససేమిరా అనడంతో ఆగ్రహం పెంచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాధితురాలి ఇంటికి కొందరు దుండగులు నిప్పంటించారు. అందులో ఉన్న వారు త్రుటిలో తప్పించుకున్నారు. స్థానిక వైసీపీ నేతల ప్రోద్భలంతో నిందితుడు సాయిరెడ్డి సోదరుడైన శంకర్‌ రెడ్డి, ఆయన స్నేహితుడు వీరంకి సత్యనారాయణ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2020-09-03T07:43:46+05:30 IST