‘మాన్సాస్‌ ట్రస్టు’పై విచారణ 9కి వాయిదా

ABN , First Publish Date - 2020-03-25T08:13:09+05:30 IST

విజయనగరంలోని మాన్సాస్‌ ట్రస్టుకు నూతన చైర్మన్‌ నియామకంతో పాటు ట్రస్టు వ్యవస్థాపక కుటుం బ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న...

‘మాన్సాస్‌ ట్రస్టు’పై విచారణ 9కి వాయిదా

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని మాన్సాస్‌ ట్రస్టుకు నూతన చైర్మన్‌ నియామకంతో పాటు ట్రస్టు వ్యవస్థాపక కుటుం బ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ వచ్చే నెల 9కి వాయిదా పడింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులకు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


మాన్సాస్‌ చైర్మన్‌గా సంచయితను నియమించడంతో పాటు ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్‌వీ సునీతాప్రసాద్‌లను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ నెల 3న జీవో 74, 75లను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవోలను సవాల్‌ చేస్తూ ట్రస్టు మాజీ చైర్మన్‌ అశోక్‌గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా సింహాచలం దేవస్థానం ట్రస్టు చైర్మన్‌గా సంచయితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను సవాల్‌ చేస్తూ మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపకుడైన పీవీజీ రాజు కుమార్తె ఆర్‌వీ సునీతాప్రసాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2020-03-25T08:13:09+05:30 IST