ఏలూరు ఘటనలో వ్యక్తి మృతి.. చంద్రబాబు దిగ్ర్భాంతి
ABN , First Publish Date - 2020-12-07T02:32:39+05:30 IST
ఏలూరులో వింత వ్యాధి ప్రబలింది. దీంతో దాదాపు 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వీరందరికి చికిత్స కొనసాగుతోంది...

అమరావతి: ఏలూరులో వింత వ్యాధి ప్రబలింది. దీంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరందరికి చికిత్స కొనసాగుతోంది. అయితే శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందారు. దీంతో మాజీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన సూచించారు. బాధితులకు అత్యున్నత వైద్యసేవలు అందించాలని కోరారు. ఏలూరులో పారిశుద్ధ్య, ప్రజారోగ్యం మెరుగుపరచాలని చంద్రబాబు చెప్పారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ ‘‘జగన్‌రెడ్డి నిర్లక్ష్య ధోరణితో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రజలు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. ఏలూరులో శ్రీధర్ మృతి ప్రభుత్వ హత్యే. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.’’ అని అన్నారు.
కాగా ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆదివారం ఉదయం మూర్చ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. ఉదయం నుంచి చికిత్స పొందిన శ్రీధర్ సాయంత్రం చనిపోయారు. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. సరైన వైద్యం అందకనే మృతి చెందాడని ఆరోపించారు. ఇతర అనారోగ్య సమస్యల కారణాల వల్లే శ్రీధర్ మృతి చెందాడని వైద్యులు అంటున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో మిగతా రోగుల పరిస్థితిపై వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు