కరోనా ఎఫెక్ట్.. సినిమా హాళ్ల మూత..!

ABN , First Publish Date - 2020-03-13T08:49:23+05:30 IST

భయపడినట్టుగానే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా...

కరోనా ఎఫెక్ట్.. సినిమా హాళ్ల మూత..!

  • నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్‌
  • నిర్ధారించిన పుణె వైరాలజీ ల్యాబ్‌
  • అప్రమత్తమైన వైద్య అధికారులు
  • మరిన్ని పటిష్ఠ చర్యలకు ఏర్పాట్లు
  • సినిమా హాళ్ల మూతకు కలెక్టర్‌ ఆదేశం
  • రాష్ట్రంలో మరో 6 అనుమానిత కేసులు


నెల్లూరు, కర్నూలు, విజయవాడ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): భయపడినట్టుగానే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్‌ అని పుణె వైరాలజీ ల్యాబ్‌ నిర్ధారించింది. మొదట తిరుపతి స్విమ్స్‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌ అని గుర్తించారు. తుది నివేదిక కోసం ఆ శాంపిల్స్‌ను పుణెలోని ల్యాబ్‌కు పంపగా.. ఆ నివేదిక గురువారం అందింది. అందులోనూ పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్టు కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా అంతా హెల్త్‌ అలెర్ట్‌ ప్రకటించారు.


కలెక్టర్‌ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జీజీహెచ్‌లో ఐసోలేషన్‌ వార్డు ఉండగా, అదనంగా జిల్లాలోని మరో మూడు ఆస్పత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. నెల్లూరులోని సినిమా థియేటర్లు, హోటళ్ల యజమానులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. కొన్ని రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని ఆదేశించారు. షాపింగ్‌మాల్స్‌లో కూడా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాగా నెల్లూరులో రెండో రోజు కూడా అధికార బృందాలు పర్యటించాయి. ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు లిక్విడ్‌ క్లోరిన్‌ను స్ర్పే చేశారు. మరో 14 మంది కరోనా అనుమానితులకు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో పరిశీలనలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


కర్నూలులో ముగ్గురికి లక్షణాలు

కర్నూలు జిల్లాలో కరోనా అనుమానంతో ముగ్గురు పెద్దాసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో చేరారు. ఈ ముగ్గురూ ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారని అధికారులు చెబుతున్నారు. నగరానికి చెందిన ఓ మహిళ గత నెల జెరూసలేం యాత్రకు వెళ్లి ఈ నెల 6న తిరిగొచ్చారు. అప్పటి నుంచి ఆమెకు దగ్గు అధికం కావడంతో బంధువులు రెండు రోజుల క్రితం సర్వజన ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుకు తీసుకొచ్చారు. ఆమె నుంచి శాంపిల్స్‌ సేకరించి తిరుపతికి పంపగా.. నెగిటివ్‌ వచ్చింది. గడివేముల మండలానికి చెందిన మరో మహిళ కొన్ని నెలల క్రితం అమెరికా వెళ్లి ఈ నెల 9న తిరిగొచ్చారు. 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆమెను ఐసోలేషన్‌ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు.


కర్నూలు నుంచి వరంగల్‌కు వెళ్లిన ఎన్‌ఐటీ విద్యార్థికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విద్యార్థి ఈ నెల 1న అమెరికా కాన్ఫరెన్స్‌కు వెళ్లి తిరిగి స్వస్థలమైన కర్నూలుకు వచ్చాడు. ఈ నెల 8న వరంగల్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి తీవ్రమైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అక్కడి ఎంజీహెచ్‌ హాస్పిటల్‌లో కరోనా అనుమానిత కేసుగా నమోదు చేసి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. అలాగే విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం కొత్తూరుకు చెందిన యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్యులు విశాఖలోని ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రికి తరలించారు. రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన ఈ యువకుడు ఈనెల 2న స్వగ్రామానికి వచ్చాడు. 9న జ్వరం, దగ్గుతో అస్వస్థతకు గురయ్యాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో స్థానిక పీహెచ్‌సీ వైద్యులు గురువారం ఆ యువకుడితో పాటు అతని సోదరుడిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోనూ సింగపూర్‌ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. అయితే వ్యాధి నిర్ధారణ కాలేదు. 


విజయవాడలో మరొకరికి..

విజయవాడకు చెందిన ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల జర్మనీ వెళ్లిన ఆ యువకుడు ఢిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల మీదుగా గురువారం రాత్రి 9:30 గంటలకు గన్నవరం చేరుకున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆ వ్యక్తికి నిర్వహించిన స్ర్కీనింగ్‌లో కరోనా పాజిటివ్‌ అని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అతన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో విజయవాడలోని అతని ఇంటికే తీసుకువెళ్లారు. అతని నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తామని కృష్ణా జిల్లా వైద్య శాఖాధికారి టి.ఎ్‌సఆర్‌.మూర్తి తెలిపారు.


Updated Date - 2020-03-13T08:49:23+05:30 IST