ఆస్తి కోసం సీఐ వేధింపులు.. ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-07-27T21:41:51+05:30 IST
జిల్లాలోని పట్టాభిపురం సీఐ కళ్యాణ రాజుపై అర్బన్ ఎస్పీకి ఉపేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆస్తి రాసివ్వాలని తన కూతురు-అల్లుడు తనను వేధిస్తున్నారని పట్టాభిపురం పోలీసులను ఆశ్రయిస్తే

గుంటూరు: జిల్లాలోని పట్టాభిపురం సీఐ కళ్యాణ రాజుపై అర్బన్ ఎస్పీకి ఉపేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆస్తి రాసివ్వాలని తన కూతురు-అల్లుడు తనను వేధిస్తున్నారని పట్టాభిపురం పోలీసులను ఆశ్రయిస్తే ప్రతిగా తననే చిత్రహింసలకు గురిచేశారని బాధితుడు ఉపేంద్ర ఆరోపించారు. వివరాల్లోకెళితే.. ఉపేంద్రకు ఒక కూతురు ఉంది. ఆమెకు కొంతకాలం క్రితం పెళ్లి అయ్యింది. అయితే ఇప్పుడు కూతురు-అల్లుడు కలిసి తమకు ఆస్తి రాసివ్వాలని ఉపేంద్రపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఉపేంద్ర పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు అతని వాదనను పట్టించుకోకపోగా అతని కూతురు-అల్లుడికి మద్దతుగా నిలిచారు. అడిగిన లంచం ఇవ్వకపోవడంతో స్టేషన్ సీఐ తన అల్లుడికి వత్తాసు పలుకుతున్నాడని బాధితుడు ఉపేంద్ర ఆరోపిస్తున్నాడు. సీఐ కళ్యాణ రాజు తన అల్లుడి వద్ద రూ. లక్ష లంచం తీసుకుని తనను చిత్రహింసలు పెట్టాడని ఫిర్యాదులో ఆరోపించాడు. సీఐ ప్రోద్బలంతో తనను తీవ్రంగా కొట్టి దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ఆస్తి రాయకపోతే నీ అంతు చూస్తానని సీఐ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో ఉపేంద్ర పేర్కొన్నాడు. తమకు న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీకి ఉపేంద్ర వేడుకున్నాడు.