-
-
Home » Andhra Pradesh » madras land sections still in AP
-
ఏపీలో మద్రాస్ చట్టం.. ఆలస్యంగా వెలుగులోకి..!
ABN , First Publish Date - 2020-03-13T08:29:21+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టం అమలు చేస్తే ఎలా ఉంటుంది? భూములను స్వాధీనం చేసుకోవడానికి సొంతంగా అనేక చట్టాలు ఉన్నా..మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టం కింద నోటీసులు ఇస్తే...

ఎక్కడ ఆంధ్రప్రదేశ్...ఎక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ? మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్ ప్రాంతంతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఇటీవల రాష్ట్ర విభజన జరిగి 13 జిల్లాలతో కూడిన ఏపీగా మిగిలింది. ఈ మధ్యకాలంలో భూముల కేటాయింపు, స్వాధీనంపై అనేక చట్టాలు తీసుకొచ్చారు. అయినా.. ఏపీలో తాజాగా మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టాన్ని రెవెన్యూ అధికారులు అమలు చేసి అడ్డంగా దొరికిపోయారు.
- భూముల స్వాధీనానికి ‘ప్రెసిడెన్సీ’ కింద నోటీసులు
- ఒకే రోజు నోటీసు.. స్వాధీనం
- అడ్డంగా దొరికిపోయిన రెవెన్యూశాఖ
- కోర్టు అక్షింతలతో దిద్దుబాటు చర్యలు
అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టం అమలు చేస్తే ఎలా ఉంటుంది? భూములను స్వాధీనం చేసుకోవడానికి సొంతంగా అనేక చట్టాలు ఉన్నా..మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టం కింద నోటీసులు ఇస్తే చెల్లుబాటవుతుందా? ఒకే రోజు నోటీసు ఇచ్చి...అదే రోజు మధ్యాహ్నానికి పంటను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుంటే చట్టం అనుమతిస్తుందా? ఇవన్నీ రెవెన్యూశాఖకు తెలియనివి కావు. చట్టాలను తయారు చేసి అమలు చేయడం, వాటిని పాటించాలని ప్రజలకు గుర్తుచేయడంలో ఆ శాఖకు ఎనలేని ఘనకీర్తి ఉంది.
అలాంటి శాఖే ఏపీలో ఇళ్లస్థలాలకు భూముల స్వాధీనానికి మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టాన్ని వర్తింపజేసింది. ప్రభుత్వ, పోరంబోకు, కాలువ గట్లు తదితర భూములు ఆక్రమణకు గురైతే, వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం-1905ను తీసుకొచ్చారు. ఏపీ ఆవిర్భావం నుంచి ఇదే చట్టాన్ని అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరకరమైన భూములను పేదలు ఆక్రమించుకొని సాగుచేసుకుంటుంటే వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టంలోని నిబంధనల ఆధారంగానే నోటీసులు ఇవ్వాలి. కానీ ఏ చట్టం కింద ఏ నోటీసు ఇచ్చినా ఎవరు పట్టించుకుంటారులే! అన్న ధీమాతో పేదల ఆక్రమణలో ఉన్న భూముల స్వాధీనానికి మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టం కింద కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరు, ఉభయ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో ఈ తరహా నోటీసులు ఇచ్చినట్లు రైతులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రెండు రకాల భూములు..
ఆక్రమణ భూముల్లో రెండు రకాలు ఉంటాయి. అభ్యంతరకరమైనవి అంటే చెరువు, వాగు, కుంట భూములు. వీటిని కొంతమంది కాలాన్ని బట్టి సాగుకు వినియోగిస్తుంటారు. అభ్యంతరం లేనివి అంటే పోరంబోకు, కొండ భూములు. సుదీర్ఘకాలం అవి పేదల ఆక్రమణలో ఉంటే అభ్యంతరం లేని కేటగిరీ కింద ఆ భూములను పేదల పేరిట క్రమబద్ధీకరిస్తుంటారు. గత కొంతకాలంగా క్రమబద్ధీకరణ చేయడం లేదు. ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూమి కావాల్సి వచ్చింది. దీంతో పేదల సాగులో ఉన్న పోరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు.
దీని ప్రకారం భూ ఆక్రమణ చట్టంలోని సెక్షన్-7 కింద నోటీసు ఇవ్వాలి. 15 రోజుల్లోగా రైతు ఆ నోటీసుపై స్పందించాలి. సహేతుక కారణాలను చూపిస్తూ బదులివ్వడానికి తనకు ఇంకా సమయం కావాలని కోరవచ్చు. దీనికి అనుమతించాలి. ఆ తర్వాత గడువు ముగిశాక, రైతు సమాధానంపై సంతృప్తి చెందకపోతే సెక్షన్-6 ఆధారంగా భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఇంటిస్థలాల విషయంలో ఈ నిబంధన అమలు కావడం లేదు. అత్యధిక కేసుల్లో నోటీసులతో సంబంధం లేకుండానే భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల నిరసన తీవ్రంగా ఎదురవుతున్న చోట నోటీసులు ఇస్తున్నారు. 4జిల్లాల్లో మాత్రం మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టంలోని సెక్షన్ 7 కింద నోటీసులు ఇచ్చారు. దీన్ని రైతులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఇలాంటి కేసులపై అనేక ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు విచారణ జరిపినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టం కింద నోటీసులు ఇచ్చిన విషయం వెలుగు చూసింది. అంతేకాదు, ఒకే రోజు సెక్షన్ 7 కింద నోటీసు ఇవ్వడం, అదే రోజు సెక్షన్ 6 కింద భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఆర్డర్ ఇచ్చిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ చర్యను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
కోర్టు విచారణతో వెలుగులోకి..
కోర్టు విచారణ సందర్భంగా భూముల స్వాధీనం, సేకరణలో రెవెన్యూశాఖ నుంచి జరిగిన అనేక తప్పులు చర్చకొచ్చాయి. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్(ఏజీ) హాజరై వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం లేవనెత్తిన సందేహాలు, ప్రశ్నలకు సర్కారు ఇచ్చిన సమాధానం కొత్త అంశాలను తెరపైకి తెచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని, కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ, తదుపరిగా న్యాయ చిక్కులు తలెత్తకుండా పనిచేయాలని రెవెన్యూశాఖ అత్యవసర సందేశం పంపించింది.
అనేక ప్రాంతాల్లో కుంట పోరంబోకు, బండి దారి కాలువపోరంబోకు, కొండ పోరంబోకు, శ్మశానాల భూములను నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నారు. అసైన్డ్ భూముల స్వాధీనానికి ఏపీ అసైన్‌మెంట్ చట్టం కింద నోటీసు ఇవ్వాలి. కానీ పలు ప్రాంతాల్లో ఇతర చట్టాల కింద నోటీసులు ఇచ్చారు. అనేక కేసుల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. భూముల స్వాధీనం, సేకరణలో నిబంధనలు పాటించాలంటూ కలెక్టర్లను ఆదేశించారు.