చంద్రబాబు, బుద్దా వెంకన్నలపై మద్దాలి గిరి సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2020-09-20T17:57:57+05:30 IST
బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో రథంలోని మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది.

గుంటూరు : బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో రథంలోని మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఈ విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరేమో అదుగో నువ్వే దొంగ అని.. ఇంకొకరేమో ఆయన ఇంట్లోనే ప్రతిమలు ఉన్నాయని ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి దగ్గరైన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి మీడియా ముందుకొచ్చి చంద్రబాబు, బుద్దా వెంకన్నలపై సంచలన ఆరోపణలు చేశారు.
ఆనాడు కూల్చివేతపై మాట్లాడారా..?
గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాళ్ళు టీడీపీ నేతలు అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దేవుడంటే అసలు నమ్మకం లేదని.. ఏపీలో చంద్రబాబు కుల, మతాలను రెచ్చగోడుతున్నారని మద్దాలి విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా..? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. పుష్కరాల్లో 30మందిని చంద్రబాబు బలి తీసుకున్నారని గిరి సంచలన ఆరోపణలు చేశారు. ఎక్కడో చిన్న తప్పిదాలు జరిగితే సీఎం వైఎస్ జగన్, మంత్రి వెల్లంపల్లి మీద బురద చల్లుతున్నారని వ్యాఖ్యానించారు.
నాలుగు అడుగుల దూరంలో..!
‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైకిల్ బెల్‌లను దొంగతనాలు చేసేవాడు. బుద్దిలేని వ్యక్తి బుద్దా వెంకన్న. మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెండి సింహాలు ఉన్నాయని ఆయన చెప్పడం దారుణం. మంత్రి వెల్లంపల్లి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వెండి రథంకి నాలుగు అడుగుల దూరంలో బుద్దా వెంకన్న ఇల్లు ఉంది. వెండి సింహాలు మాయంపై బుద్దా వెంకన్నను విచారణ చేయాలి’ అని మద్దాలి గిరి మీడియా ముఖంగా డిమాండ్ చేశారు.
బుద్దా ఏమంటున్నారు..!?
మాయమైన వెండి సింహం ప్రతిమలు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాయని బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు. ఒక తాంత్రికుడి సూచనతో మంత్రి వాటిని తన ఆధీనంలో ఉంచుకున్నారని చెప్పుకొచ్చారు. ఆలయ ఈవో కేవలం నిమిత్త మాత్రుడేనన్నారు. ఈవో, వెలంపల్లి ఫోన్ సంభాషణల కాల్ లిస్ట్ బయటకు తీస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. పవిత్రమైన దుర్గగుడిని మంత్రి వెలంపల్లి దోపిడీ కేంద్రంగా మార్చుకున్నారని, డమ్మీ ఈవోను నియమించుకుని తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. వెలంపల్లిని కట్టడి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనన్నారు. ఆయన తనకేమీతెలియనట్టుగా మంత్రుల అవినీతిని, తప్పులను సమర్థిస్తుంటే ఆయనకే చేటన్నారు. మంత్రి తన తప్పు తెలుసుకొని, తన ఇంట్లోని సింహపు ప్రతిమలను అమ్మవారి గుడిలో అప్పగిస్తే మంచిదని హితవు పలికారు.