పార్టీలో యువనేతలకు లోకేశ్‌ విందు

ABN , First Publish Date - 2020-03-02T09:05:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ యువ నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో మధ్యాహ్న భోజన విందు...

పార్టీలో యువనేతలకు లోకేశ్‌ విందు

  • భువనేశ్వరితో కలిసి హాజరైన చంద్రబాబు


అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ యువ నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో మధ్యాహ్న భోజన విందు ఇచ్చారు. భార్యాభర్తలను కలిపి ఆహ్వానించడంతో సుమారు ముప్పై ఐదు జంటలు దీనికి హాజరయ్యాయి. పార్టీ అధినేత చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.


లోకేశ్‌ తన భార్య  బ్రహ్మణితో కలిసి అందరినీ ఆహ్వానించారు. పోయిన ఎన్నికల్లో పోటీచేసిన యువ నేతలు, ప్రస్తుతం చురుగ్గా ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనుకొంటున్న నేతలు, పార్టీలోని ప్రముఖ నేతల వారసులను దీనికి పిలిచినట్లు సమాచారం. ఒక కుటుంబ సమావేశం మాదిరిగా దీనిని నిర్వహించారని, ప్రత్యేకమైన అజెండా ఏదీ లేదని ఒక యువ నేత  తెలిపారు. హాజరైన వారిలో ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్‌నాయుడు, గౌతు శిరీష, బండారు అప్పలనాయుడు, చింతకాయల విజయ్‌, రాయలసీమ నుంచి టీజీ భరత్‌, జేసీ పవన్‌కుమార్‌ రెడ్డి, పయ్యావుల కేశవ్‌, పరిటాల శ్రీరాం, భూమా అఖిలప్రియ, దీపక్‌ రెడ్డి, బొజ్జల సుధీర్‌రెడ్డి, కేఈ హరి, గాలి భానుప్రకాశ్‌, కోస్తా ప్రాంతం నుంచి ఆదిరెడ్డి భవాని తదితరులు ఉన్నారు.  


సిగ్గు పూర్తిగా వదిలేశారా జగన్‌? : లోకేశ్‌

సిగ్గు అనేది పూర్తిగా వదిలేశారా జగన్‌ మోహన్‌రెడ్డి? ప్రభుత్వ ప్రకటనల్లో ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చేయడానికి దేమైనా మీ దొంగ సాక్షి అనుకున్నారా?... అని లోకేశ్‌ ప్రశ్నించారు. ‘జనవరి 2019 నుంచి మీరు ప్రజల నెత్తిన పడిన జూన్‌ 2019 వరకూ 54.47 లక్షల మందికి పింఛన్‌ ఇచ్చిన విషయం మర్చిపోయారా? మీ నాయన కేవలం రూ.200 ఇస్తే... మా నాయన 2014లో రూ.వెయ్యికి, 2019లో రెండువేలకు పెంచారు. అంటే పదిరెట్లు ఎక్కువ. ఇప్పుడు తమరు వచ్చి రూ.3వేలు అని చెప్పి.. రూ.250పెంచి మోసం చేసింది కాక... ప్రభుత్వ సొమ్ముతో, ఇలా అబద్ధపు డబ్బాలు కొట్టుకుంటారా?’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు. 


Updated Date - 2020-03-02T09:05:40+05:30 IST