-
-
Home » Andhra Pradesh » Lockdown terms All public representatives
-
ప్రతివాదులుగా వారంతా..
ABN , First Publish Date - 2020-05-13T09:52:35+05:30 IST
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులందరినీ ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు సూ చించింది.

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ప్రజాప్రతినిధులందరినీ చేర్చండి
పిటిషనర్‌కు హైకోర్టు సూచన
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులందరినీ ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు సూ చించింది. ఆ మేరకు సాక్ష్యాధారాలతో సహా పూర్తి వివరాలు తమ ముందుంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులు, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి దోహదపడేలా జరుగుతున్న సమావేశాలను అడ్డుకోవాలని, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రకటించాలని, వారిని క్వారంటైన్‌కు తరలించాలని అభ్యర్థిస్తూ న్యాయవాది పారాకిశోర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. లాక్‌డౌన్ ప్రారంభమై ఇంతకాలమైనా ఇప్పటికీ పలువురు నేతలు యథేచ్ఛగా బయట తిరుగుతూ జనాన్ని పోగుచేస్తున్నారని తెలిపారు.
జనసమూహాలతో కార్యక్రమాలు నిర్వహించడంపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది సి.సుమన్ వాదనలు వినిపిస్తూ.. జనసమూహంతో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎవ్వరికీ ఎలాంటి అనుమతీ ఇవ్వలేదని, మునుముందు కూడా ఇవ్వబోదని స్పష్టంచేశారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. లాక్‌డౌన్ ఉల్లంఘించిన నేతలు ఇంకెవరైనా ఉంటే సాక్ష్యాలతో సహా తమ ముందుంచాలని సూచించింది. కాగా, 2018-19, 2019-20కి గాను ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ కింద తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.