నెలరోజుల ‘లాక్‌’!

ABN , First Publish Date - 2020-04-24T07:43:20+05:30 IST

ఆర్థికం కంటే ఆరోగ్యమే ముఖ్యం! ఇప్పుడు బతికుంటే, తర్వాత ఎంతైనా సంపాదించుకోవచ్చు! అందుకే... కరోనా కట్టడికి కష్టమని తెలిసినా, ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసినా కేంద్ర ప్రభుత్వం మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్...

నెలరోజుల ‘లాక్‌’!

కేసులకు ఏదీ డౌన్‌?

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆర్థికం కంటే ఆరోగ్యమే ముఖ్యం! ఇప్పుడు బతికుంటే, తర్వాత ఎంతైనా సంపాదించుకోవచ్చు! అందుకే... కరోనా కట్టడికి కష్టమని తెలిసినా, ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసినా కేంద్ర ప్రభుత్వం మార్చి 24వ తేదీ నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా ఈ లాక్‌డౌన్‌ సమయంలోనే కరోనా వైరస్‌ ‘సామాజిక వ్యాప్తి’ దశకు చేరుకుంది. ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అవి అంతకంతకు పెరుగుతున్నాయి. అందులోనూ, ‘క్వారంటైన్‌’కు బయట ఉన్న వారికీ వైరస్‌ సోకుతోంది. రాష్ట్రంలో తొలి కొవిడ్‌-19 కేసు మార్చి 13వ తేదీన నెల్లూరు జిల్లాల్లో నమోదైంది. ప్రధాని దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన 23వ తేదీ నాటికి 7 కేసులు మాత్రమే ఉన్నాయి. మార్చి 31 వరకూ అంతా నియంత్రణలోనే ఉన్నట్లు కనిపించింది. అప్పటికి 44 పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ... ఏప్రిల్‌ ఒకటిన కరోనా అందరినీ ఫూల్‌ చేసింది. ఏప్రిల్‌ 1వ తేదీన ఒకే రోజు 67 పాజిటివ్‌ కేసులు నమోదయాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 111కు చేరింది. ఆ రోజు నుంచి ప్రతి రోజూ 25 నుంచి 30కు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాతో ఇప్పటికి 27 మంది మరణించారు. గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో తీవ్రతను పరిశీలిస్తే... ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం కేసులు వెయ్యి దాటే అవకాశం కనిపిస్తోంది.


నష్టం జరిగిందిలా...

అంతర్జాతీయంగా వేగంగా పెరుగుతున్న కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఆరోగ్యశాఖ ఫిబ్రవరి 24వ తేదీ నుంచే కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అప్పటికి రాష్ట్రంలో ఒక్క నిర్ధారణ ల్యాబ్‌ లేకపోయినా పుణె, హైదరాబాద్‌కు శాంపిల్స్‌ పంపించి పరీక్షలు నిర్వహించారు. మార్చి 22వ తేదీదాకా ప్రభుత్వం నుంచి తగిన సహకారం లేకపోయినా ఆరోగ్యశాఖ అధికారులు అన్ని పనులు చేసుకున్నారు. ప్రభుత్వం కరోనా నివారణకు కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఒక వైపు కరోనా తీవ్ర పెరుగుతుంటే ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో వంద కేసులు నమోదైన తర్వాతకానీ కరోనా సెగ ప్రభుత్వానికి తగలలేదు.


సర్వే ఫలితం సున్నా...

విదేశాల నుంచి వచ్చిన వారిని, ఢిల్లీ నుంచి  వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం మూడుసార్లు సర్వేలు చేయించింది. విదేశాల నుంచి 28 వేల మంది, ఢిల్లీ నుంచి సుమారు 1100 మంది రాష్ట్రానికి వచ్చారని గుర్తించింది. కానీ, వారిని క్వారంటైన్‌ చేయడంలో విఫలమయింది. ‘ఢిల్లీ రిటర్న్స్‌’ వల్ల తీవ్ర నష్టం  జరిగే అవకాశముందని మార్చి 30వ తేదీనే సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ ప్రభుత్వమే స్వయంగా క్వారంటైన్‌ చేయాల్సింది. కానీ... ‘ఇళ్లలోనే ఉండండి’ విషయాన్ని వారికే వదిలేసింది. ప్రభుత్వ ఆదేశాలను కొంత మంది మాత్రమే పాటించారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని... ఢిల్లీ కనెక్షన్‌ ఉన్న వారిని క్వారంటైన్‌కు పంపించాలని అధికార యంత్రాంగం ప్రయత్నించినా... చాలాచోట్ల రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయి. తమ వారికి ఇంటి వద్దనే ఉంచి చికిత్స చేయించాలని కూడా నేతలు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో వైరస్‌ విస్తృతి మరింత పెరిగింది. ఇప్పుడు ‘సామాజిక వ్యాప్తి’ దశకు చేరుకుంది. ప్రస్తుతం సుమారు వందమందికి వైరస్‌ ఎవరి ద్వారా, ఎలా సోకిందో కూడా తెలియదని (కాంటాక్ట్‌) అధికార వర్గాలు చెబుతున్నాయి. 


ఆ మూడు సంఘటనలు... 

రాష్ట్రంలో మూడు సంఘటనలు మూడు జిల్లాలను ముంచేశాయి. గుంటూరు, కర్నూలు, చిత్తూరులో కేసులు పెరగడం వెనుక ప్రజాప్రతినిధుల విచ్చలవిడితనం స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలులో మర్కజ్‌ కేసులకు దీటుగా స్థానిక వైద్యుడి ‘కాంటాక్ట్‌’వల్ల పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. కొవిడ్‌-19తో ఆ వైద్యుడు మరణించడం విషాదమైతే... అంతకు కొన్ని రోజుల ముందు ఆయన సుమారు 4వేల మందికి చికిత్స అందించారని తెలియడం పెద్ద ఆందోళనకు దారితీసింది. దీంతో కర్నూలులో కేసుల సంఖ్య ఎక్కడిదాకా వెళ్తుందనేది అధికారులకు అంచనాకు రాలేకపోతున్నారు. కరోనా కేసుల విషయంలో కర్నూలు తర్వాతి స్థానం గుంటూరు జిల్లాదే. ఇక... చిన్న పట్టణమైన శ్రీకాళహస్తిలో ఎక్కడా లేని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా సాయం పేరిట జరిగిన జన జాతర అగ్నికి ఆజ్యం పోసినట్లయిందని అధికారులు వాపోతున్నారు. 


లాక్‌డౌన్‌... కరోనా వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం! విదేశాల్లో వైరస్‌ సోకిన వారు, వారి ద్వారా కరోనా బారిన పడిన వారందరికీ విధిగా చికిత్స చేయాలి. వారి ‘కాంటాక్ట్‌’లందరినీ 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలి. ప్రజలెవ్వరూ ఇంటి నుంచి కదలకుండా కట్టడి చేయాలి! అప్పుడు... వైర్‌సకు కళ్లెం పడుతుంది! ఇదే.... లాక్‌డౌన్‌ వెనుక ఉద్దేశం! లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చి నేటికి సరిగ్గా నెల రోజులు. మరి... దాని లక్ష్యం నెరవేరిందా?


ఎట్టకేలకు మార్పు వచ్చింది

లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలి రోజుల్లో ప్రజలు చిన్న చిన్న పనులకు కూడా రోడ్ల మీదకు వచ్చేవారు. కూరగాయల మార్కెట్ల వద్ద రేపే ప్రపంచం అంతమైపోతుందున్న విఽధంగా బారులు తీరారు. ఉదయం పూట సూపర్‌ మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయేవి. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు, మరణాల దృష్ట్యా కరోనా అంటే భయం మొదలయింది. ప్రస్తుతం 90 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. నాయకులు మాత్రం సహాయం పేరిట విచ్చలవిడిగా తిరుగుతూనే ఉన్నారు. లాక్‌డౌన్‌ ఫలితాలు వందశాతం రావాలంటే... కనీసం ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే మరోసారి ‘పొడిగింపు’ తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 


Updated Date - 2020-04-24T07:43:20+05:30 IST