అదుపు తప్పుతోంది

ABN , First Publish Date - 2020-06-01T08:17:49+05:30 IST

రాష్ట్రంలో కరోనా అదుపు తప్పుతోంది. నానాటికీ వైరస్‌ విజృంభిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

అదుపు తప్పుతోంది

లాక్‌డౌన్‌ సడలింపులతో భారీ ముప్పు

5 రోజులుగా వందల్లో కేసులు ..

వంద మార్కు దాటేసిన 11 జిల్లాలు

కర్నూలు తరహాలో ‘తూర్పు’ దూకుడు..

15 తర్వాత తీవ్ర స్థాయికి 


అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా అదుపు తప్పుతోంది. నానాటికీ వైరస్‌ విజృంభిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత 5రోజుల నుంచి సగటున రోజూ వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ సడలింపులతో వైద్యవర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చిలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నాటినుంచి పరిశీలిస్తే ప్రతి నెలా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. మార్చి 13న నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదయింది. ఆ నెల 31వరకూ రాష్ట్రంలో కేవలం 44 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఏప్రిల్‌ 30నాటికి వాటి సంఖ్య 1,403కి చేరింది. అంటే ఒక్క ఏప్రిల్‌లోనే 1,359మందికి వైరస్‌ సోకింది. ఇక మే నెలలో ఏకంగా 2,168 కేసులు వెలుగులోకి వచ్చాయి. (వీరిలో విదేశాల నుంచి వచ్చిన 111మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 418మంది ఉన్నారు.) లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలులో ఉండగానే 80రోజుల వ్యవధిలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3వేలు దాటేసింది.ఇప్పుడు ప్రభుత్వం లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా ఐదు రోజుల నుంచి 134, 128, 85, 131, 110 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


జిల్లాకో కథ 

దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 700మందికి పైగా వైరస్‌ సోకింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో 5 రోజుల వ్యవధిలో సుమారు 120 కేసులు బయటపడ్డా యి. ఇదంతా ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న లెక్కలు మాత్రమే. ఇవికాకుండా మరిన్ని కేసులు ఉంటాయని సమాచారం. విజయనగరం, ప్రకాశం మినహా మిగిలి న అన్ని జిల్లాల్లో వంద కేసులు పైగా నమోదయ్యా యి. ఢిల్లీ మర్కజ్‌ వల్ల కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసులు భారీగా పెరిగాయి. శ్రీకాళహస్తి ఉదంతంతో చిత్తూరులో కేసులు అధికంగా నమోదయ్యాయి. తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరులో జిల్లాల్లో కో యంబేడు కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. 


మరింత వేగంగా

రాష్ట్రంలో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కరో నా ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తొలి 500 కేసుల నమోదుకు మాత్రం 33 రోజులు వ్యవధి పట్టింది. ఆ తర్వాత ప్రతి 500 కేసులు కేవలం సగటున 9 రోజుల వ్యవధిలోనే నమోదయ్యా యి. ఏప్రిల్‌ 20 నుంచి మే 5వరకూ రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టించింది. మళ్లీ అలాంటి పరిస్థితి ఇప్పుడు మొదలయింది. మే 24నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూన్‌లో పరిస్థితి అదుపు తప్పేలా కనిపిస్తోందని, 15 తర్వాత 500 కేసుల మార్కును దా టేసే అవకాశాలున్నాయని నిర్ధారిస్తున్నారు. 


Updated Date - 2020-06-01T08:17:49+05:30 IST