‘లాక్‌’ తీస్తారా?

ABN , First Publish Date - 2020-04-15T08:54:18+05:30 IST

‘‘వచ్చేనెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది.

‘లాక్‌’   తీస్తారా?

శ్రీకాకుళం, విజయనగరంలో కేసులు నిల్‌!

20వ తేదీ నుంచి సడలింపుపై ఆశలు

ప్రధాని ప్రకటన నేపథ్యంలో అంచనాలు

రెడ్‌జోన్‌ సమీప మండలాల్లో అప్రమత్తం

రాష్ట్ర సరిహద్దుల్లోనూ పటిష్ఠ చర్యలు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి):‘‘వచ్చేనెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. పూర్తిగా సురక్షితం అని కేంద్రం భావించిన ప్రాంతాల్లో మాత్రం ఈనెల 20వ తేదీ నుంచి కొంత సడలింపులు ఉంటాయి’’... ఇదీ మంగళవారం ప్రధాని మోదీ చేసిన ప్రకటన సారాంశం. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో... ఆ రెండు జిల్లాల్లో 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను సడలించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఆ రెండు జిల్లాల్లో వాణిజ్య, పారిశ్రామిక లావాదేవీలను తిరిగి ప్రారంభించే అవకాశముంది.


విజయనగరం జిల్లాలో ఫెర్రో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 20శాతం సిబ్బందితో నడుస్తున్నాయి.  ఈనెల 20 తరువాత వీటికి 50 శాతం సిబ్బందిని అనుమతించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. అరబిందో, రెడ్డీస్‌, బయోటెక్‌ పరిశ్రమలతోపాటు బల్క్‌ డ్రగ్‌ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది. భవన నిర్మాణం, సాధారణ వాణిజ్య, వ్యాపారాలు, ఉపాధి హామీ పనులకూ వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర మార్గదర్శకాలు విడుదలైన తర్వాత ఈ సడలింపుపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.


రెడ్‌ జోన్లు అనుకొని...

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా కేసులు లేనప్పటికీ... ఇటు విశాఖలో, పొరుగున ఉన్న ఒడిసాలో ఈ సమస్య ఉంది.   ఈ నేపథ్యంలో... ఆ రెండు ప్రాంతాల్లో నుంచి ఇటువైపు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం, విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంతో పూర్తిగా మిళితమైౖ ఉంటుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాలు, మండలాలు (జామి-పద్మనాభం) సైతం విశాఖ గ్రామీణ ప్రాంతాలను ఆనుకొని ఉంటాయి. దీంతో అక్కడి వారు ఇక్కడికి.. ఇక్కడి వారు అక్కడికి సునాయాసంగా వెళ్లి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి చోట్ల నిఘా పటిష్ఠం చేస్తారు.


అలాగే ఆనందపురం, రాజపులోవ, భోగాపురం మండల సరిహద్దులు పటిష్ఠం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఒడిసాతో సరిహద్దులు ఉన్నాయి. ఇచ్ఛాపురం మండలంలోని అనేక గ్రామాలు ఒడిసాలోని పల్లెలకు పక్కనే ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో నిఘా మరింత పటిష్ఠం చేస్తారు. విజయనగరం జిల్లాలోని సాలూరు, పాచిపెంట మండలాలు, కూనేరు ఒడిసా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వ్యవస్థను మరింత పటిష్ఠం చేయనున్నారు.


వలస కూలీలతో... 

ఈ రెండు జిల్లాల ప్రజలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. చాలామంది వివిధ మార్గాల ద్వారా తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు స్వగ్రామాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఇలా వచ్చే వారి విషయంలో ఏం చేయాలనే అంశంపైనా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారుల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి వారిని నిర్దిష్టకాలం క్వారంటైన్‌లో ఉంచిన తర్వాతే అనుమతించే అవకాశముంది.

Updated Date - 2020-04-15T08:54:18+05:30 IST