ఆర్డినెన్స్‌లోని షెడ్యూల్‌ ప్రకారమే..

ABN , First Publish Date - 2020-03-08T09:16:31+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారమే ఎన్నికల షెడ్యూల్‌ రూపొందించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు.

ఆర్డినెన్స్‌లోని షెడ్యూల్‌ ప్రకారమే..

సచివాలయ రంగులు కోర్టు పరిధిలో.. ఇళ్ల స్థలాల పంపిణీకి ఓకే 

స్థానిక ఎన్నికల నిర్వహణపై కమిషనర్‌ రమేశ్‌కుమార్‌


అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారమే ఎన్నికల షెడ్యూల్‌ రూపొందించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన కోడ్‌ తక్షణమే అమల్లోకి వచ్చిందన్నారు. శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్న కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు, రాయితీలపై నిషేధం అమల్లోకి వస్తుందన్నారు. బదిలీలు వెంటనే నిషేధించాలని, కొత్తగా నియామకాలు చేపట్టరాదని రమేశ్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు ఈ దఫా ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన వివరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున సచివాలయ భవనాలకు వైసీపీ రంగులను తొలగించేందుకు ఆదేశాలిస్తారా? అని మీడియా ప్రశ్నించగా... ఈ విషయంపై కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని, వాటిపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని చెప్పారు. కొత్తగా ఎక్కడైనా ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తే అలాంటి అంశాలను కమిషన్‌ కోడ్‌ కింద పరిగణిస్తుందన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ పథకంలో ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైనందున కోడ్‌ వర్తించదన్నారు. 


Updated Date - 2020-03-08T09:16:31+05:30 IST