‘నా ఇష్టం’ చెల్లదు!

ABN , First Publish Date - 2020-05-30T08:48:50+05:30 IST

‘‘ఈ ప్రభుత్వం మాది. ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఎన్నికల కమిషనరే నిర్ణయాలు తీసుకుంటే ఇక మేమెందుకు? పాలించేది మేమా.... ఆయనా!?’’

‘నా ఇష్టం’ చెల్లదు!

ఎన్ని సీట్లొచ్చినా రాజ్యాంగమే చుక్కాని.. పాలకులు కట్టుబడాల్సిందే

ఎస్‌ఈసీపై తీర్పుతో మరోసారి సుస్పష్టం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘‘ఈ ప్రభుత్వం మాది. ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఎన్నికల కమిషనరే నిర్ణయాలు తీసుకుంటే ఇక మేమెందుకు? పాలించేది మేమా.... ఆయనా!?’’


నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినప్పుడు అధికార పార్టీ చేసిన గర్జన ఇది! అసలు విషయమేమిటంటే... ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచినప్పటికీ పాలన మాత్రం రాజ్యాంగబద్ధంగా సాగాల్సిందే. ‘‘అధికారం నాది- - అంతా నా ఇష్టం’ అంటే కుదరదు! రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ప్రజలు ఎన్నుకున్న వారు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప... ‘నేను చెప్పిందే వేదం.


చేసిందే శాసనం’ అంటే కుదరదు. ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, లేదా ఒక పద్ధతి పూర్తిగా పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా మనుగడ సాగించేందుకు రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాట్లు చేశారు. ‘నాకు ఇష్టమైతే ఉంచుతా... లేదంటే తుంచుతా’ అనే వైఖరిని కోర్టులు అంగీకరించవు. ఏదైనా తేడా వస్తే... హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జోక్యం చేసుకుని సరిచేసుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ప్రాథమిక హక్కుల విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పులు ఇవ్వడం తెలిసిందే.


ఎవరికి వారుగా... 

చట్టాలు రూపొందించే, వాటిని అమలుచేసే పరిపాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ...ఈ మూడూ వేటికవే స్వతంత్రంగా పనిచేసేలా చేశారు. ఒకదానికంటే ఒకటి తక్కువగా ఏర్పాటుచేయలేదు. ఈ ఏర్పాటువల్లే తాత్కాలిక అన్యాయం జరిగినా...మళ్లీ మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేందుకు ఆస్కారం ఏర్పడింది. అధికారంలో ఉన్న పార్టీలు అంతా నా ఇష్టం అనేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. చట్టసభలు చట్టాలు చేస్తాయి. అవి న్యాయానికి, రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా? లేదా? అని చూసే బాధ్యత న్యాయస్థానాలది. అదేవిధంగా చట్టాలను అమలుచేసే బాధ్యతను రాజ్యాంగం పాలనా యంత్రాంగానికి అప్పగించింది.


ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరొందిన భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్నంగా రాశారు. అన్ని విషయాలపై లోతుగా చర్చించి, భవిష్యత్తును ఊహించి మరీ ఆయా అంశాలను పొందుపరిచారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విధులు, బాధ్యతలను ఆర్టికల్‌ 243(కె)లో వివరంగా చెప్పారు. ఎస్‌ఈసీ  పదవీకాలం కూడా నియామక ఉత్తర్వుల్లోనే పొందుపరచాలి. దానిని మధ్యలో మార్చే అధికారం పాలకులకు ఇస్తే... స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు అవకాశం ఉండదు. ఎస్‌ఈసీ స్వేచ్ఛగా పని చేయలేరు. 


ఆ తీర్పునకు తప్పుడు భాష్యం

ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తొలగింపుపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుంది. ఆ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఇలాగే తీసివేశారని, ఇక్కడ కూడా అదే పద్ధతి అనుసరించామంది. అయితే... ఎస్‌ఈసీని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ కోర్టు స్పష్టం చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(కె)ను ఉల్లంఘించారంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం చేసిన పని విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. అయితే... సాంకేతిక కారణాలతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేయలేదు.  మిగిలిందంతా వదిలేసి... చివర్లో చూపిన సాంకేతిక కారణాలనే ఏపీ సర్కారు పరిగణనలోకి తీసుకుంది. నిమ్మగడ్డ రమేశ్‌ను తొలగించడమే లక్ష్యంగా ఆర్డినెన్స్‌ జారీ చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పులోని స్ఫూర్తిని గ్రహించలేదనే విమర్శలు అప్పుడే వచ్చాయి. చివరకు రాష్ట్ర హైకోర్టు సదరు ఆర్డినెన్సును కొట్టేసింది.

Updated Date - 2020-05-30T08:48:50+05:30 IST