ఇస్తారా... చస్తారా

ABN , First Publish Date - 2020-12-25T09:03:31+05:30 IST

‘ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వండి. వాటి విజయవంతానికి సహకరించండి’... రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్‌ చేసే విన్నపాలివి! మరి..

ఇస్తారా... చస్తారా

బ్యాంకర్లపై ప్రభుత్వం స్వారీ 

శక్తికి మించిన పనులు చేయలేకపోతున్నాం

బ్యాంకు ఉన్నతాధికారులకు యూనియన్ల లేఖ 

పథకాలకు రుణాలివ్వాలని ఒత్తిళ్లు.. వినకపోతే కక్ష సాధింపు

కలెక్టర్ల నుంచి కమిషనర్ల వరకూ జోక్యం

అనంతపురంలో బ్యాంకులోనే కలెక్టర్‌ సమీక్ష

కరెంట్‌ కట్‌ చేయాలన్న ఓ జాయింట్‌ కలెక్టర్‌

తోడు, చేయూత పథకాల్లో బినామీలే అధికం 

‘పశుక్రాంతి’ యూనిట్ల రూపకల్పనలో లోపాలు

 ‘వైఎస్‌ఆర్‌ బీమా’తో బ్యాంకర్లపై తీవ్ర ఒత్తిడి 


అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడు  సోమందేపల్లిలోని రెండు బ్యాంకులకు వచ్చారు. ‘వైఎస్సార్‌ బీమా, చేయూత పథకాల దరఖాస్తులు సాయంత్రంలోపు అప్‌లోడ్‌ చేయాల్సిందే! జగనన్న తోడుకు వందశాతం రుణాలు ఇవ్వాల్సిందే’ అని హుకుం జారీ చేశారు.


‘‘బ్యాంకులకు తాగునీళ్లు, కరెంటు కట్‌ చేస్తే... వాళ్లే దారికి వస్తారు’’ అని ఓ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అనధికారిక ఆదేశాలు జారీ చేశారు. 


‘జగనన్న తోడు’లో కూడా అసలైన లబ్ధిదారులకంటే బినామీలే ఎక్కువ కనిపిస్తుండటంతో... వారికి రుణం ఇవ్వడమెలాగో, తిరిగి వసూలు చేసుకోవడమెలాగో తెలియక బ్యాంకర్లు తలలు పట్టుకుంటున్నారు. పశుకాంత్రి లాంటి పథకాల అమలు మరింత కష్టంగా మారిందని, రుణాలకు సంబంధించి యూనిట్ల డిజైన్ల రూపకల్పనలోనే లోపముందఅంటున్నారు. 


జగనన్న తోడు, చేయూత పథకాల అమలులో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని... ఆచరణ సాధ్యంకాని నిబంధనలతో ఇబ్బంది పెడుతున్నారని అమరావతి సర్కిల్‌ పరిధిలోని ఎస్‌బీఐ అధికారుల సంఘం బ్యాంకు ఉన్నతాధికారులకు లేఖ రాసింది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

‘‘ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వండి. వాటి విజయవంతానికి సహకరించండి’... రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్‌ చేసే విన్నపాలివి! మరి.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసా!? ‘రుణాలు ఇస్తారా... చస్తారా’ అని ప్రభుత్వ అధికారులు బ్యాంకులపై ఒత్తిడి తెస్తున్నారు. లోపాలున్నా, నిబంధనలు అంగీకరించకున్నా సరే... ‘టార్గెట్‌’ రీచ్‌ కావాల్సిందే అంటూ వారిపై స్వారీ చేస్తున్నారు. లేదంటే... కరెంట్‌ కట్‌ చేస్తామని, నీటి సరఫరా నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. తాజాగా... కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్తవేసి మరీ ‘అధికారిక నిరసన’ వ్యక్తం చేశారు.


ప్రభుత్వం రకరకాల పథకాలు ప్రవేశపెట్టుకోవచ్చు. ప్రజల చేత జేజేలు కొట్టించుకోవచ్చు. కానీ... బ్యాంకులు మాత్రం ప్రభుత్వ కౌంటర్‌ గ్యారెంటీలు, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే రుణాలు మంజూరు చేస్తాయి. గతంలో ఎన్నడూలేని విధంగా బ్యాంకర్లపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. ‘మీ నిబంధనలతో మాకు పని లేదు. మేం ఎంపిక చేసిన లబ్ధిదారులకు, మా లక్ష్యాల మేరకు రుణాలు ఇవ్వాల్సిందే’ అని కలెక్టర్ల నుంచి మునిసిపల్‌ కమిషనర్ల వరకు బ్యాంకర్లపై స్వారీ చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల బ్యాంకర్లు, అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. శక్తికి మించిన ఈ పనులు చేయలేకపోతున్నామంటూ బ్యాంకుల యూనియన్లు ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నాయి.


చేతులెత్తేస్తున్న బ్యాంకులు  

వైఎ్‌సఆర్‌ బీమా, జగనన్న తోడు, వైఎ్‌సఆర్‌ చేయూత పథకాల ద్వారా లబ్ధికలిగించే బాధ్యతను బ్యాంకులకే అప్పగించారు. గతంలో బీమాకు బ్యాంకులతో సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు... పథకం దరఖాస్తులు బ్యాంకుల ద్వారా నమోదు చేయించాలనే నిబంధనపెట్టారు. ఇది ఆచరణలో కష్టసాధ్యంగా మారుతోంది. పథకాన్ని ప్రారంభించి 2నెలలవుతున్నా ఇప్పటి వరకూ 50శాతం మంది లబ్ధిదారులు కూడా నమోదు కాలేదు. అరకొర సమాచారంతో వచ్చిన దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసే పరిస్థితి లేక బ్యాంకుల్లో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. 


ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయాలు పాటించం 

జగనన్న తోడు, వైఎ్‌సఆర్‌ చేయూత పథకాలను బ్యాంకుల ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వికటించే ప్రమాదముందని బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. బ్యాంకుల నిబంధనలు పట్టించుకోకుండా ఎస్‌ఎల్‌బీసీలో నిర్ణయం తీసుకుంటున్నారని... వాటిని బ్యాంకర్లు పాటించాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రభుత్వం ఏ నిబంధనలు రూపొందించినా, బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలు మాత్రమే అమలు చేస్తారని, వాటిని మీరి పనిచేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ‘‘బ్యాంకుల రుణ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించిన రుణాలకు పూచీకత్తు తప్పనిసరి. చేయూత పథకంలో యూనిట్‌ రూ.75 వేలకు గాను రూ.18,750 లబ్ధిదారుల వాటా పోను రూ.56,250 రుణం ఇవ్వాలని ప్రాజెక్టు తయారు చేశారు. కానీ... ఎవరు ష్యూరిటీ ఇస్తారో తెలియదు. దీంతో  చేయూత పథకం కింద రుణాల మంజూరు నత్తనడకన సాగుతోంది’’ అని ఒక అధికారి తెలిపారు.


లక్ష్యం చేరని పథకాలు 

రాష్ట్రవ్యాప్తంగా 1.41కోట్ల కుటుంబాలను వైఎ్‌సఆర్‌ బీమా లో చేర్చేందుకు ప్రభుత్వం బీమా కంపెనీలకు రూ.510కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకుంది. అక్టోబరు 21న సీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటికి ఈ పథకంలో 50 లక్షల మంది కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. జగనన్న తోడు పథకానికి సంబంధించి మొత్తం 7.94లక్షల దరఖాస్తులొస్తే వాటిలో అర్హతఉన్న 7.41లక్షలను బ్యాంకులు స్వీకరించి 5.63 లక్షల దరఖాస్తులకు రుణాలిచ్చేందుకు ఆమోదం తెలిపాయి. అయితే, ఇప్పటివరకు కేవలం 2.17 లక్షల మందికి మాత్రమే రూ.10 వేల రుణాలు అందించగలిగారు. 


ఇటీవల ఒక సమీక్షలో సెర్ప్‌ ఉద్యోగులు బ్యాంకు ఉన్నతాధికారులను నిలదీశారు. ‘మేం చెప్పినట్లు వినాల్సిందే’ అన్నట్లుగా వ్యవహరించారు. దీనిని జీర్ణించుకోలేని బ్యాంకు అధికారులు... సమావేశం రద్దు చేసుకొని బయటకు వెళ్లిపోయారు.

Updated Date - 2020-12-25T09:03:31+05:30 IST