-
-
Home » Andhra Pradesh » Licenses for bars not paying fees
-
‘బార్’ ఫీజు కట్టాలా? వద్దా?
ABN , First Publish Date - 2020-06-22T09:20:52+05:30 IST
అటు వ్యాపారం వదులుకోలేక ఇటు ప్రస్తుత పరిస్థితుల్లో చేయని వ్యాపారానికి లైసెన్సు ఫీజులు కట్టలేక బార్ల లైసెన్సీలు

- నెలాఖరుతో ముగుస్తున్న రెన్యువల్స్
- కడితే నష్టం ఎలా భరించాలి?..
- కట్టకపోతే.. మొత్తంగా మూసివేత
- యజమానుల్లో గందరగోళ పరిస్థితి..
- స్పష్టత ఇవ్వని ఎక్సైజ్ శాఖ
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): అటు వ్యాపారం వదులుకోలేక ఇటు ప్రస్తుత పరిస్థితుల్లో చేయని వ్యాపారానికి లైసెన్సు ఫీజులు కట్టలేక బార్ల లైసెన్సీలు కొట్టుమిట్టాడుతున్నారు. బార్లకు ప్రతి ఏటా లైసెన్స్ ఫీజు చెల్లించి రెన్యువల్ చేసుకోవాలి. ఈ నెలాఖరుతో ప్రస్తుత లైసెన్స్ ఫీజు కాలపరిమితి ముగుస్తుంది. వచ్చే ఏడాదికి ఇప్పుడు ఫీజులు కడితే లైసెన్స్ రెన్యువల్ అవుతుంది. కానీ, కొవిడ్-19 కారణంగా దాదాపు మూడు మాసాలుగా మూతపడిన బార్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో బార్‌ల యాజమాన్యాలు ఫీజులు కట్టాలా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుత బార్ పాలసీ 2017-22 వరకు ఉంది. ప్రారంభంలో ప్రాంతాల వారీగా 10, 20, 30 లక్షల రూపాయల చొప్పున లైసెన్సు ఫీజులు ఉన్నాయి.
ఏటా దానిపై 10ు ఫీజు పెరుగుతుంది. ఇప్పుడు నగరాల్లో బార్లకు దాదాపు రూ.40 లక్షలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి. కానీ, మూడు నెలలు బార్లు మూతపడి ఉండటంతో వాటి అద్దెలు, వ్యాపార నష్టం యాజమాన్యాలకు భారంగా మారాయి. వ్యాపారం చేయనప్పటికీ ఫీజులు మాత్రం కట్టాల్సి వచ్చింది. బార్లు ఎప్పుడు తెరుస్తారు అనేదానిపైనా ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఎక్సైజ్ శాఖ కూడా దీనిపై ఎలాంటి స్పష్టతనూ ఇవ్వడం లేదు. దీంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒకవేళ ఇప్పుడు ఫీజులు కట్టినా బార్లు తెరుచుకుని వ్యాపారం ఎప్పటికీ మొదలవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. లేక ఫీజులు కట్టకపోతే మరో రెండేళ్లు ఉన్న లైసెన్స్ గడువును ఇప్పుడే కోల్పోవాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై అధికారులు ఒక స్పష్టతనిస్తే దాని ప్రకారం వెళ్తామని, కానీ, అధికారులు కనీసం కలిసేందుకు కూడా సమయం ఇవ్వడం లేదని లైసెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమ్ముకునే అవకాశంపై మీనమేషాలు
బార్లలో కొన్ని నెలలుగా ఉన్న మద్యం పాడైపోతోందని, అమ్ముకునే అవకాశం ఇవ్వాలని బార్ల యాజమాన్యాలు కోరగా షాపుల ద్వారా అమ్ముకునేందుకు రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ వారం కిందట ఆదేశాలు జారీచేశారు. కానీ ఇంతవరకూ ఆ ఆదేశాలు కింద వరకూ రాలేదు. దీంతో బార్లలో ఉన్న మద్యం అలాగే మిగిలిపోయింది. లిక్కర్ ఎంతకాలం ఉన్నా ఫరవాలేదు కానీ, బీర్ ఆరునెలలు దాటితే పాడైపోతుంది. ఇప్పటికే లాక్‌డౌన్ ప్రారంభమై మూడు నెలలు దాటింది. అంతకముందు తయారీ సమయాన్ని కూడా కలిపితే దాదాపుగా ఆరు నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో వాటినైనా అమ్ముకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరామని, కానీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినా కింది స్థాయికి చేరకపోవడం ఇబ్బందిగా మారిందని బార్ యజమానులు అంటున్నారు.