కుక్కలు, పందులకు లైసెన్సు

ABN , First Publish Date - 2020-12-30T07:45:56+05:30 IST

కొత్తగా గ్రామంలో షాపు పెట్టాలంటే లైసెన్సు! గ్రామ శివార్లలో గనులు తవ్వాలంటే లైసెన్సు! ప్రైవేటుగా చేపట్టే ప్రతి పనికీ అనుమతి పొందాల్సిందే......

కుక్కలు, పందులకు లైసెన్సు

  • ఇకపై మెడలో బిళ్ల తప్పనిసరి
  • గ్రామాల్లో పెంచుకోవాలంటే
  • పంచాయతీ అనుమతి కావాలి
  • పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు


అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొత్తగా గ్రామంలో షాపు పెట్టాలంటే లైసెన్సు! గ్రామ శివార్లలో గనులు తవ్వాలంటే లైసెన్సు! ప్రైవేటుగా చేపట్టే ప్రతి పనికీ అనుమతి పొందాల్సిందే! ఇకపై కుక్కలను పెంచుకోవాలన్నా, పందులను సాదుకోవాలన్నా గ్రామ పంచాయతీల్లో లైసెన్సు తీసుకోవాల్సిందే! గ్రామాల్లో తలెత్తుతున్న వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. గ్రామాల్లో రైతులు, గృహస్థులు, కాపరులు, కొన్ని తెగలవారు పెంచుకొనే శునకాలు, వరాహాలకు లైసెన్స్‌లను  తప్పనిసరి చేసింది. సాధారణంగా వీధుల్లో తిరిగే కుక్కలను, వాటికి పుట్టిన పిల్లలను చుట్టుపక్కల ఇళ్లవారు తీసుకెళ్లి పెంచుకొంటూ ఉంటారు. తాము తినేదానిలో ఒక ముద్ద వేసి గొర్రెలు, పశువుల కాపలాకు వాడుకొనే రైతులు, కాపరులు గ్రామాల్లో కనిపిస్తున్నారు. ఇకపై ఇలాంటివారంతా తాము పెంచుకొనే మూగజీవాల సమాచారం తప్పనిసరిగా పంచాయతీలకు ఇవ్వాల్సిందే. డబ్బులు కట్టుకొని, లేదంటే ఉచితంగా పంచాయతీ జారీచేసే లైసెన్స్‌లను కుక్కలు, పందులకు తగిలించాల్సిందే! ఈమేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం జీవో ఇచ్చారు. లైసెన్సులు లేకుండా కనిపించిన కుక్కలు, పందులను ఎవరికీ చెందనివిగా అధికారులు పరిగణిస్తారు. వాటి సంతతి పెరగకుండా శస్త్రచికిత్సలు చేయడం, వ్యాధులు వ్యాపించడాన్ని నిరోధించేందుకు స్టెరిలైజేషన్‌ చేయడం వంటివి చేస్తారు. సిబ్బంది పట్టుకున్న కుక్కల్లో ఏవన్నా ప్రాణంతక- నయం కాని వ్యాధులతో బాధ పడుతున్నట్లయితే అలాంటి వాటికి నొప్పి తెలియని రీతిలో ‘కారుణ్య మరణాల’కు గురి చేయనున్నారు. సర్పంచుల పర్యవేక్షణలో గ్రామ కార్యదర్శి, పీహెచ్‌సీ వైద్యుడు, వెటర్నరీ వైద్యులు, జంతుప్రేమిక సంస్థల ప్రతినిధులు సభ్యులతో కూడిన కమిటీ...ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది, 


పంచాయతీల పరిధిలో కుక్కలు, పందులను పెంచుకుంటున్న ప్రతి ఒక్కరూ విధిగా ఆ ప్రాంత వెటర్నరీ వైద్యుడిచ్చే సర్టిఫికెట్లను సమర్పించాలి. వాటిని పరిశీలించి ఉచితంగానో లేదా నిర్దిష్ట మొత్తాలను కట్టించుకునో లైసెన్స్‌లను పంచాయతీ మంజూరు చేస్తుంది. 


బిళ్లల రూపంలోనో, బ్యాడ్జీల రూపంలోనే ఉండే ఆ లైసెన్సులను చూడగానే కనిపించేలా వాటి మెడలోనో లేదా చెవులపైనో యజమానులు కట్టాలి. 


ఏటేటా కాలపరిమితి ముగిసేందుకు 10 రోజుల ముందే లైసెన్సు పునరుద్ధరించుకోవాలి. లేదంటే వాటిని సిబ్బందితో పట్టించి, నిర్దేశిత ప్రదేశాల్లో పంచాయతీ అధికారులు ఉంచుతారు. లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేసుకునేలోపు కుక్కలకైతే ప్రతి 24 గంటలకు రూ.500 చొప్పున, పందులకైతే రూ.250 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 


ప్రాణాంతక జబ్బులతోనో లేక కోలుకోలేనంతటి గాయాలతోనో బాధ పడే వీఽధి కుక్కలకు ‘కారుణ్య మరణం’ కలిగిస్తారు.  


కారుణ్య మరణాలు లేక రాబి్‌సతో చనిపోయిన కుక్కల కళేబరాలను పంచాయతీ ఇన్సిరేటర్లలో ఉంచాలి.  


గ్రామంలోకి పందులు రాకుండా, పంచాయతీకి  3- 5 కిలోమీటర్ల దూరంలో వాటికోసం 3 లేదా 4 ప్రదేశాలను ఏర్పాటుచేయాలి. అనంతరం పెంపకందారులకు అవగాహన కల్పించి, వారికి నచ్చిన ప్రదేశాలకు 3 రోజుల్లోగా జీవాలతో సహా వెళ్లేలా చూడాలి. ఒకవేళ ఆయా స్థలాలు బంజర్లు, పోరంబోకులు ఇతరాలు అయినట్లయితే వాటిని లీజు లేక అమ్మకం ప్రాతిపదికన పెంపకందారులకు ఇవ్వవచ్చు.

Updated Date - 2020-12-30T07:45:56+05:30 IST