ఎల్జీ పాలిమర్స్ ఎండీ అరెస్టు
ABN , First Publish Date - 2020-07-08T08:43:26+05:30 IST
ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజీకి బాధ్యులైన ఆ కంపెనీ ఎండీ-సీఈవో సుంకీ

- స్టైరిన్ లీకేజీ కేసులో మరో 11 మంది సంస్థ అధికారులూ
- దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.. విశాఖ సీపీ మీనా వెల్లడి
- దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది
- ఇంకొందరు బాధ్యులు తేలినా చర్యలు
- విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా వెల్లడి
- ఇదే ఘటనలో ముగ్గురు అధికారులు సస్పెన్షన్
- పీసీబీలో ఇద్దరు, ఫ్యాక్టరీలో ఒకరు
విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజీకి బాధ్యులైన ఆ కంపెనీ ఎండీ-సీఈవో సుంకీ జియాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్ సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మే ఏడో తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా.. 500 మంది వరకూ తీవ్ర ప్రభావితులైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గోపాలపట్నం పోలీసు స్టేషన్‌లో 304-11, 278, 284, 285, 337, 338 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద (క్రైమ్ నంబర్ 213/2020) కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టి.. మంగళవారం అరెస్టు చేసినట్టు విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఇక్కడ విలేకరులకు తెలిపారు. ప్రమాదానికి కారణాలను అన్వేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల ఉన్నత స్థాయి నిపుణులతో హైపవర్ కమిటీని నియమించిందని, ఆ కమిటీ సోమవారం తన నివేదికను అందజేసిందని గుర్తుచేశారు.
ఆ నివేదికతోపాటు వేర్వేరు శాఖల రిపోర్టులు, వాటిలోని అంశాలు, సూచనల ఆధారంగా దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ఎండీ సుంకీ జియాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్‌తోపాటు పిచుక పూర్ణచంద్రమోహనరావు (పరిశ్రమ ఆపరేషన్స్ విభాగం అదనపు డైరెక్టర్), కోడి శ్రీనివాస కిరణ్‌కుమార్ (ఎస్‌ఎంహెచ్ విభాగం ఇన్‌చార్జి), రాజు సత్యనారాయణ(ప్రొడక్షన్ టీమ్ లీడర్), కసిరెడ్ల గౌరీశంకర నాగేంద్రరావు, చెదుముపాటి చంద్రశేఖర్, కె.చక్రపాణి (ఇంజనీర్లు), మొద్దు రాజేఽశ్ (ఆపరేటర్), పొట్నూరు బాలాజీ (రాత్రి డ్యూటీ ఆఫీసర్), శిలపరశెట్టి అచ్యుత్ (జీపీపీఎస్ ఇన్‌చార్జి), కొండవలస వెంకటనరసింహ రమేశ్ పట్నాయక్ (రాత్రి షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్)లను అరెస్టు చేశామన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో ఏమైనా కొత్త విషయాలు వెలుగుచూసినా, ఇంకా బాధ్యులను గుర్తించినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ దుర్ఘటనకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిందన్నారు. పరిశ్రమలో ప్రమాదం జరగకుండా తనిఖీలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో ఉదాసీనంగా వ్యవహరించారనే అభియోగంపై డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కేబీఎస్ ప్రసాద్‌తోపాటు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రాంతీయ అధికారి పి.ప్రసాదరావు, గతంలో అదే హోదాలో పనిచేసిన ఆర్.లక్ష్మీనారాయణపై వేటు వేసిందని తెలిపారు. ఎం-6 ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరగడం, సేఫ్టీ ప్రొటోకాల్ సక్రమంగా పాటించకపోవడం, సేఫ్టీపై అవగాహన సరిగా లేకపోవడం, యాజమాన్యం ఉదాసీనత, లోపభూయిష్టమైన నిర్వహణ ప్రమాదానికి కారణాలుగా కమిటీ తన నివేదికలో పేర్కొందని చెప్పారు.