‘స్టైరిన్‌’ ఆవిరిగా ఎలా మారింది?

ABN , First Publish Date - 2020-06-11T09:19:28+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంలో ‘పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(పెసో)’ పాత్రపై హైపవర్‌ కమిటీ దృష్టిసారించింది.

‘స్టైరిన్‌’ ఆవిరిగా ఎలా మారింది?

  • దానిని ఎలా నిల్వ చేస్తున్నారు?
  • ప్రమాదానికి కారణాలేంటి?
  • ‘పెసో’ అధికారులను ఆరా తీసిన హైపవర్‌ కమిటీ సభ్యులు
  • ప్రమాదం జరిగిన రోజు రాత్రి 1000 పీపీఎం నమోదుపైనా విచారణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంలో ‘పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(పెసో)’ పాత్రపై హైపవర్‌ కమిటీ దృష్టిసారించింది. స్టైరిన్‌ ఆవిరిగా ఎందుకు మారింది?, దానికి దారితీసిన కారణాలు ఏమిటి? అనే అంశాలపై విశాఖపట్నంలో మూడు రోజులు ఆరా తీసిన హైపవర్‌ కమిటీ పెసో అధికారులతో ప్రత్యేకంగా చర్చించింది. ‘పెసో’ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ‘పెసో’ ప్రధాన కేంద్రం నాగ్‌పూర్‌లో ఉంది. విశాఖపట్నంలో అమ్మోనియం నైట్రేట్‌, పెట్రో ఉత్పత్తుల దిగుమతి పెరుగుతున్న నేపథ్యంలో 2014లో ఇక్కడ సబ్‌ సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. పెట్రో ఉత్పత్తులు ఉపయోగించే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం, వాటి పర్యవేక్షణ కూడా ‘పెసో’ బాధ్యతే. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి దారితీసిన స్టైరిన్‌ కూడా పెట్రోలియం ఉత్పత్తే. దానిని పాలిమర్స్‌ యాజమాన్యం సింగపూర్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.


దీనికి కూడా పెసోనే అనుమతులు ఇవ్వాలి. అలాగే స్టైరిన్‌ ఎలా నిల్వ చేస్తున్నారు? వాటి ట్యాంకుల సామర్థ్యం, పనితీరు, భద్రత. వంటి అంశాలు కూడా ‘పెసో’ పర్యవేక్షించాల్సి ఉందని పరిశ్రమల శాఖ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పాలిమర్స్‌కు ఎంత పరిమాణంలో స్టైరిన్‌ దిగుమతి చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు? ఎంత నిల్వ చేశారు? ఆ ట్యాంకుల పరిస్థితి ఏమిటనే వివరాలను హైపవర్‌ కమిటీ పెసో అధికారుల నుంచి తెలుసుకుంది. 


ట్యాంకులో సెన్సర్లు లేవు

ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి కారణమైన స్టైరిన్‌ ట్యాంకులో మొత్తం మూడు సెన్సర్లు ఉండాలి. 10 అడుగులలోపు ఒకటి, ఆ తరువాత ఒకటి, మరొకటి పైన ఉండాలి. ఇవి ట్యాంకులో స్టైరిన్‌ ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాయి. అయితే ఆ ట్యాంకులో కింది భాగంలో మాత్రమే సెన్సర్‌ ఉందని, దాంతో పైన ఆవిరి తయారైనట్టు గుర్తించినా.. దాని ఉష్ణోగ్రత ఎంత అనేది రికార్డు కాలేదని అధికారులు చెబుతున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌లో మూడు వేల టన్నుల సామర్థ్యం గల స్టైరిన్‌ ట్యాంకు ఉంది. అయితే, ఇది చాలా పాతది. దీనివల్లే ప్రమాదం జరిగిందని, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారని హైపవర్‌ కమిటీ ఆరా తీసింది. 


ఆ రోజు రాత్రి 1000 పీపీఎం నమోదు

వాతావరణం(పీల్చే గాలి)లో ఏయే వాయువులు ఎంతెంత పరిమాణంలో ఉన్నాయనే వివరాలు తెలుసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలి పార్ట్స్‌ పెర్‌ మిలియన్‌(పీపీఎం)లో కొలుస్తుంది. ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7, తెల్లవారు జామున 2.41 గంటలకు స్టైరిన్‌ బయటకు వచ్చింది. అప్పుడు అక్కడి ఎయిర్‌ యాంబియెంట్‌ క్వాలిటీ యంత్రంలో స్టైరిన్‌ పీపీఎం 1000గా నమోదైంది. గాలిలో స్టైరిన్‌ ‘సున్నా’నే ఉండాలి. యంత్రంలో అత్యధిక రీడింగ్‌ 1000గా ఉంటుంది. దానిని దాటి నమోదు కాదు. అందులో వెయ్యిగా నమోదై ఉండడంతో అంతకంటే ఎక్కువే వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి పది గంటలకు అధికారులు మరోసారి పీపీఎం వివరాలు పరీక్షిస్తే.. ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో స్టైరిన్‌ పీపీఎం 461గా, కంపెనీ మెయిన్‌ గేటు వద్ద 365గా నమోదైంది. స్టైరిన్‌ పీపీఎం సున్నాకు చేరిన తరువాత ప్రజలను తిరిగి అనుమతించినట్టు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు.

Updated Date - 2020-06-11T09:19:28+05:30 IST