పరిహారపు జాతర

ABN , First Publish Date - 2020-05-19T08:54:56+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ బాధిత గ్రామమైన ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో వైసీపీ నేతలు సోమవారం పెద్ద జాతర చేశారు. సీఎం జగన్‌ ఫొటోను పాలతో అభిషేకించారు.

పరిహారపు జాతర

ఎల్జీ బాధిత గ్రామంలో 500 మందితో వైసీపీ సందడి


విశాఖపట్నం, మే 18(ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌ బాధిత గ్రామమైన ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో వైసీపీ నేతలు సోమవారం పెద్ద జాతర చేశారు. సీఎం జగన్‌ ఫొటోను పాలతో అభిషేకించారు. కోలాటాలు, తప్పెటగుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఇందులో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఇంత సందడికి కారణమేమిటంటే... ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది! అందుకే... ఈ వేడుకలు! దీనికోసం కరోనా లాక్‌డౌన్‌నూ లెక్క చేయలేదు. పెళ్లి చేసుకుంటే 50 మందికి, చావుకైతే 20 మందికి మించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ... వైసీపీ నేతలు ఏకంగా 500 మంది ఈ జాతర చేశారు.


నిజానికి... స్టైరిన్‌ గ్యాస్‌ బాధితులను పరామర్శించాలని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ మూడు రోజుల క్రితం ఆర్‌ఆర్‌ వెంకటాపురం బయలుదేరినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ 144 సెక్షన్‌ అమలులో ఉందని, వెళ్లకూడదని పోలీసులు వారిద్దరినీ, అనుచరులతో సహా ముందే అదుపులోకి తీసుకొని నగరంలోని మూడు నాలుగు పోలీస్‌ స్టేషన్లకు తిప్పి, రాత్రి 10 గంటల తరువాత సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అధికార పార్టీ వేడుకను మాత్రం ఎంచక్కా అనుమతించారు.



Updated Date - 2020-05-19T08:54:56+05:30 IST