విద్యుత్ చార్జీలు పెంచబోం: బాలినేని
ABN , First Publish Date - 2020-12-07T08:43:40+05:30 IST
విద్యుత్ చార్జీలను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): విద్యుత్ చార్జీలను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ లోగోను ఆదివారం ఆయన అమరావతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యుత్ రంగం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రజలపై భారం మోపరాదని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. విద్యుత్ సంస్థల ఆర్థిక ఇబ్బందులను కరోనా సంక్షోభం మరింత పెంచిందని, ప్రజల భాగస్వామ్యంతో విద్యుత్ సంస్థల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపర్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతరం, అంబేడ్కర్ 64వ వర్ధంతి సందర్భంగా విద్యుత్ సంస్థల కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులర్పించారు.
విద్యుత్ మీటర్ల పేరుతో రైతులకు ఉరి: కళా
పంపుసెట్లకు మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల గొంతుకు ఉరి బిగిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. అప్పులపై ఆధారపడి బతుకీడుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం కొత్త అప్పుల కోసం మీటర్లు పెట్టడానికి సిద్ధపడటం దుర్మార్గమని విమర్శించారు.