సీసం చేసిన చేటు!

ABN , First Publish Date - 2020-12-10T08:18:30+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధికి గురైన బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో 70శాతం సీసం ఉన్నట్టు జాతీయ వైద్య

సీసం చేసిన చేటు!

ఏలూరులో 50 మందిని పరీక్షిస్తే

రక్త నమూనాల్లో 70 శాతం లెడ్‌

తలనొప్పి, మూర్ఛకు కారణమిదే

రోగుల్లో పురుగుమందు అవశేషాలు

క్రిమిసంహారక మందులతో పండించిన

ఉత్పత్తులను తినడమే కారణమా!

రేపటిలోగా వింత వ్యాధి మూలాలను

తేల్చేస్తామంటున్న జాతీయ బృందాలు

నీటిని కాచుకొని తాగాలని సూచనలు

కొత్తగా 19 మంది ఆస్పత్రిలో చేరిక

విజయవాడ ఆస్పత్రిలో ఇద్దరు మృతి


(ఏలూరు-ఆంధ్రజ్యోతి)

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధికి గురైన బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో 70శాతం సీసం ఉన్నట్టు జాతీయ వైద్య బృందాలు నిర్ధారించాయి. ఏలూరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన వారి నుంచి రక్త నమూనాలను సేకరించాయి.


ఈ నమూనాలను ల్యాబ్‌లకు పంపగా దాదాపు 90 శాతం మంది బాధితుల రక్త నమూనాల్లో సీసం ఉన్నట్టు నిర్ధారణ అయింది. సుమారు 50 మంది నుంచి ఈ నమూనాలు సేకరించారు. అనూహ్యంగా వీరి నమూనాల్లో సీసం శాతం అత్యధికంగా ఉన్నట్టు తేలింది. దీనికి తగ్గట్టుగానే తుది నివేదిక రూపకల్పనకు న్యూఢిల్లీ ఎయిమ్స్‌, ఐటీసీటీ నిపుణులు సిద్ధ్దపడుతున్నారు. మరోవైపు అంతుపట్టని ఈ రోగం మూలాలను ఛేదించే తుది అంకం ఆరంభమైంది. రోగుల శరీరాల్లో సీసంతోపాటు ఆర్గానో క్లోరిన్‌ రకానికి చెందిన క్రిమిసంహారక మందుల  అవశేషాలను పెద్దఎత్తున తాజాగా వైద్య బృందాలు గుర్తించాయి. క్రిమిసంహారక మందులు మితిమీరి వాడిన పొలంలో గడ్డితిన్న పశువులనుంచి తీసిన పాల ద్వారా, ఆ పొలంలో పండిన ఆహార ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ అవశేషాలు శరీరాల్లోకి చేరి ఉంటాయని న్యూఢిల్లీ ఎయిమ్స్‌ బృందాలు ప్రాథమికంగా తేల్చాయి.


అలాగే రసాయనాలు వాడి నిర్వహిస్తున్న చేపల చెరువుల్లోకి భారీగా వరదనీరు చేరిక కూడా దీనికి ఒక కారణం కావచ్చునని అనుమానిస్తున్నాయి. ఇప్పటికే అర డజనుకుపైగా నిపుణుల బృందాలు ఏలూరులో నమూనాలను సేకరించాయి. వాటిలో కొన్ని నమూనాల ఫలితాలు వచ్చాయి. మరికొన్ని రావాల్సి ఉంది. కానీ, ఐదు రోజులు గడుస్తున్నా ఏలూరు అలజడికి కారణం ఏమిటనేది ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితేఉంది. హైదరాబాద్‌, పుణె, న్యూఢిల్లీలకు పంపిన నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఏమైనా శుక్రవారంనాటికి వింతవ్యాధి మూలాలను ఛేదించి తీరుతామని పలు వైద్యసంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, బుధవారం ఏలూరు ఆస్పత్రిలో 19 మంది వింత వ్యాధి లక్షణాలతో చేరారు.  




రక్తంలోనే అంతా..

ఆర్గానో క్లోరిన్‌కు సీసం ఉత్ర్పేరకం. ఇది నరాలపై, మెదడుపై ప్రధానంగా ప్రభావం చూపుతుంది. తాగునీటిలో లెడ్‌ పెద్దగా కనిపించకపోయినా రక్త నమూనాల్లో అది స్పష్టంగా బయటపడినట్టు ఐటీసీటీ నిపుణులు తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) సంస్థ నిపుణులు... భిన్న నమూనాల సేకరణలో నిమగ్నమయ్యారు. నాలుగు బృందాలుగా విడిపోయి ఏలూరును జల్లెడపట్టారు. ఆ


స్పత్రిలో ఇన్‌పేషంట్లుగా చేరిన వారితోపాటు, పశువులు, పొలాల నుంచి నమూనాలను సేకరించారు. ఇలా సేకరించిన నమూనాలను విశ్లేషించి శుక్రవారానికి తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ (సీసీఎంబీ) సంస్థకు చెందిన నిపుణుల బృందం ఏలూరులో తాజా పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసింది. ప్రజల జీవన శైలిని పరిగణనలోకి తీసుకుని వారు వాడే ఆహారపదార్థాలు, తాగునీటితోపాటు ఇతరనమూనాలను సేకరించింది. దీని ఆధారంగానే నివేదిక అందించే అవకాశాలున్నాయి. 


రాష్ట్ర సంస్థలూ రంగంలోకి..

తాగునీరు, రక్త నమూనాల్లో లెడ్‌,ఆర్గానో క్లోరిన్‌ ఉందో లేదో తేల్చడానికి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, సిద్ధార్థ వైద్య కళాశాలలకు చెందిన నాలుగు బృందాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ బృందాలన్నీ మానవ శరీరంలోకి ఈ భారలోహాల ప్రవేశం ఎలా జరిగింది అనే దానిని ప్రధానంగా ఎంచుకుని ఆ దిశగానే శోధిస్తున్నాయి. 




భయపడింది కొవిడ్‌ బాధితులే..

ఏలూరులో వింత వ్యాధి బయటపడినప్పుడు ముందుగా భయపడింది కొవిడ్‌ బాధితులే. ముందు జాగ్రత్తగా కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నతమ బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇష్టానుసారం క్లోరిన్‌, బ్లీచింగ్‌ వినియోగించారు. దాని ప్రభావం ఏదైనా  బయట పడిందా అనే దానిపైనా నిపుణుల బృందాలు దృష్టి పెట్టాయి. దీనిపై తర్జన భర్జన జరుగుతున్నాయి. ఎనిమిది నెలల కాలంలో 15 వేల మందికిపైగా ఏలూరులో కొవిడ్‌ బారినపడ్డారు. మరోవైపు బాధితులు, ఏలూరు నగరవాసుల్లో సరికొత్త ప్రశ్న ఉత్పన్నమౌతోంది.


నీటిలో భారలోహాలు మిళితం కావడం, పురుగు మందుల అవశేషాలు రక్తనమూనాల్లో, నీటిలో ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణ అవుతున్న సమయంలో వీటి నుంచి బయటపడేందుకు తాము ఎలా వ్యహరించాలనేది వారిని ఇప్పుడు కలవరపెడుతున్న విషయం. ఇప్పుడు వినియోగిస్తున్న పాల బ్రాండ్‌లను మార్చాలని, ఒకవేళ కుళాయి నీరు తాగుతూ ఉంటే వాటిని కొంత కాలం నిలిపివేసి, కాచి చల్లార్చిన, లేదా శుద్ధి చేసిన వేరే నీటిని సేవించాలని, కూరగాయలపై క్రిమి సంహారక అవశేషాలు తొలగిపోవడానికి వీలుగా ఉప్పు నీటిలో కొంతసేపు నుంచి అనంతరం వంటకు వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 




‘గుంటూరే’ పునరావృతం? 

గుంటూరు జిల్లాను ఐదేళ్ల క్రితం ‘ఏలూరు’ తరహాలోనే వింత వ్యాధి అల్లాడించింది. అయితే,  విరుచుకుపడినంత వేగంగానే అది అదృశ్యమైనట్టు చెబుతున్నారు. ఏలూరులో నమూనాలను సేకరిస్తున్న జాతీయ పోషకాహార సంస్థకు(ఎన్‌ఐఎన్‌) చెందిన బృందం చేసిన ప్రస్తావనతో ఒకనాడు గుంటూరు జిల్లాను భయపెట్టిన ఆ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ జిల్లాలోని వినుకొండ నియోజకవర్గం పరిధిలోని ఈపూరు మండలం ఊడిజర్ల ఎస్సీ కాలనీలో 2015లో పదిమందికిపైగా వింతవ్యాధి బారినపడ్డారు. వీరిలో ఇద్దరు యువకులు మృతిచెందారు. సుమారు 30 సంవత్సరాల వయస్సు గల వీరికి తొలుత ఫిట్స్‌ వచ్చి పడిపోయారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే కోమాలోకి వెళ్లి మృత్యువాత పడ్డారు.


ఇదే గ్రామానికి చెందిన మరో ఏడెనిమిది మంది యువకులు జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలతో ఇబ్బందిపడ్డారు. జలకాలుష్యం వల్లే ఈ గ్రామం జబ్బుపడినట్టు అప్పట్లో అధికారులు నిర్థారించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎన్‌ఐఎన్‌ నిపుణులు పరిగణనలోకి తీసుకుని తమ అధ్యయనం సాగిస్తున్నారు. వ్యాధి ఆరంభమైన ప్రాంతాల్లో బాధితుల రక్తం, మూత్రాలను సేకరించి ల్యాబ్‌కు పంపింది. 


Updated Date - 2020-12-10T08:18:30+05:30 IST