నూతన్‌ నాయుడు కేసులో తాజా అప్డేట్ ఇదీ...

ABN , First Publish Date - 2020-09-13T13:43:35+05:30 IST

శిరోముండనం కేసులో అరెస్టయ్యి విశాఖ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న..

నూతన్‌ నాయుడు కేసులో తాజా అప్డేట్ ఇదీ...

విశాఖపట్నం : శిరోముండనం కేసులో అరెస్టయ్యి విశాఖ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సినీ నిర్మాత, బిగ్ బాస్ ఫేమ్ నూతన్‌ నాయుడిని పెందుర్తి పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం నాడు ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌, సీఐ అశోక్‌కుమార్‌ నూతన్‌ని స్టేషన్‌లోనే విచారించారు. ఆ తర్వాత సుజాతనగర్‌లోని నూతన్ ఇంటిలో, ఆయన తండ్రి సన్యాసిరావు నివాసంలోనూ సోదాలు చేశారు.


పోలీసులు ప్రత్యేక దృష్టి..

ఇదిలా ఉంటే.. మొత్తం మూడ్రోజుల పాటు విశాఖ పోలీసులు ఆయన్ను విచారించనున్నారు. నూతన్ బాధితులు చేసిన ఆరోపణల నేపథ్యంలో  పెందుర్తి, గోపాలపట్నం, కంచరపాలెం, మహారాణి పేట పోలీసులు ఆదివారం నాడు విచారించనున్నారు. అంతేకాదు.. శ్రీకాంత్ శిరోముండనం దృశ్యాలను ఎవరెవరికి షేర్ చేశారు..? అనే విషయంలో నూతన్ ఇంట్లో పనిచేసే వ్యక్తిగత సిబ్బందిని కూడా పోలీసులు విచారించే అవకాశముంది. అంతేకాకుండా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి ఫోన్లు చేసి పనులు చక్కబెట్టారని ఆరోపణలపై విచారణ చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు, సినిమాల్లో పాత్రలు ఇప్పిస్తానని పలువురు నుంచి నగదు వసూళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.


మరో కేసు నమోదు..

కాగా ఇప్పటికే.. విశాఖలోని మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో మరోకేసు నమోదైంది. విశాఖ జిల్లా రావికమతానికి చెందిన నాగరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు అతడిపై మోసం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకున్న పరిచయాలతో బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకున్నాడని నాగరాజు, అదే బ్యాంకులో సౌత్‌ ఇండియా రీజినల్‌ మేనేజర్‌ పోస్టు ఇప్పిస్తానని రూ.12కోట్లు తీసుకున్నట్టు శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-09-13T13:43:35+05:30 IST