జనవరి 1 నుంచి భూముల సర్వే
ABN , First Publish Date - 2020-09-01T09:20:59+05:30 IST
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు.

- వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునళ్లు
- సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ సేవలు
- రెవెన్యూశాఖకు సీఎం జగన్ ఆదేశం
అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో దీనిపై చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నందున పెద్ద ఎత్తున అదనపు బృందాలను సమకూర్చుకొని జనవరి 1న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒకేసారి సర్వే ప్రారంభించాలని రెవెన్యూశాఖకు దిశానిర్దేశం చేశారు. సమగ్ర భూసర్వేపై సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భూముల సర్వేకోసం ప్రస్తుతం 4,500 బృందాలు ఉండగా, వీటిని మరింత పెంచుకోవాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అన్ని రకాల పౌరసేవలు గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలన్నారు. భూముల సమగ్ర సర్వేపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని, దీనికిగాను గ్రామ సచివాలయాల్లో పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇదిలావుంటే, భూ సర్వేపై సీఎంకు రెవెన్యూశాఖ ప్రజంటేషన్ ఇచ్చింది. సర్వేకు ‘కార్స్’ టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని, పెద్ద ఎత్తున రోవర్లు, డ్రోన్లు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటున్నామని అధికారులు నివేదించారు. సర్వే సందర్భంగా వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు మొబైల్ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రికి వివరించారు.