రాష్ట్రానికి భూ షాక్!
ABN , First Publish Date - 2020-11-26T08:47:16+05:30 IST
భూమి యజమానికి టైటిల్ (శాశ్వత హక్కు) గ్యారెంటీ ఇవ్వడంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుండాలన్న ఉద్దేశంతో గత ఏడాది జూలైలో జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ బిల్లు-2019ను తీసుకొచ్చింది. అసెంబ్లీ, మండలిలో ఆమోదించాక గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. అయితే రాష్ట్రపతి వద్దకు వెళ్లకుండానే అది కేంద్రం కొర్రీల్లో చిక్కుకుంది

ల్యాండ్ టైటిల్ బిల్లు వెనక్కి.. సివిల్ కోర్టుకుండే అధికారాలు ఎలా రద్దు చేస్తారు?
అప్పిలేట్ అథారిటీ ఆదేశాలపై మళ్లీ జిల్లా కోర్టులో అప్పీలా?.. ఏమిటీ గందరగోళం?
కేంద్ర చట్టాలను ధిక్కరించేలా క్లాజులు.. రాష్ట్రం జవాబులతో సంతృప్తి చెందని కేంద్రం
అవగాహన లేమి, న్యాయపరిశీలన జరపని ఫలితమా?.. మళ్లీ సవరణా?.. కొత్తదా?
ల్యాండ్ టైటిల్ బిల్లు వెనక్కి
జగన్ ప్రభుత్వానికి కేంద్రం మరోషాక్ ఇచ్చింది. దేశంలో మేమే నంబర్ వన్ అంటూ పంపిన ల్యాండ్ టైటిల్ బిల్లు-2019ను ఆమోదించలేదు. బిల్లులోని అంశాలు, క్లాజులు కే ంద్ర చట్టాలను ధిక్కరించేలా ఉన్నాయని.. పలు అంశాలపై రాష్ట్రం ఇచ్చిన వివరణలు సమ్మతంగా లేవంటూ బిల్లును ఆమోదించలేదని సమాచారం. కేంద్ర చట్టాలకు ఇబ్బంది లేకుండా.. రెగ్యులర్ కోర్టులకు ఉండే న్యాయాధికారాలకు లోబడి బిల్లును మార్చుకోవాలని స్పష్టం చేసినట్లు తె లిసింది. అంటే ఆ బిల్లును సవరించి మళ్లీ అసెంబ్లీ, మండలి ఆమోదం తీసుకోవాలన్న మాట.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
భూమి యజమానికి టైటిల్ (శాశ్వత హక్కు) గ్యారెంటీ ఇవ్వడంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందుండాలన్న ఉద్దేశంతో గత ఏడాది జూలైలో జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ బిల్లు-2019ను తీసుకొచ్చింది. అసెంబ్లీ, మండలిలో ఆమోదించాక గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. అయితే రాష్ట్రపతి వద్దకు వెళ్లకుండానే అది కేంద్రం కొర్రీల్లో చిక్కుకుంది. కేంద్ర రిజిస్ట్రేషన్ చట్టం-1908, కేంద్ర భూ సేకరణ చట్టం-2013లోని పలు నిబంధనలు, క్లాజులను తోసిరాజేలా ఈ టైటిల్ బిల్లు ఉంది. అన్నీ తెలిసే కేంద్ర చట్టాలను ధిక్కరించేలా ఎలా రూపొందించారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని భూవనరుల విభాగం, కేంద్ర హోం శాఖ ప్రశ్నించాయి. ఆయా అంశాలపై ప్రశ్నావళిని రూపొందించి.. వాటికి బదులివ్వాలంటూ నిరుడు నవంబరు 19, డిసెంబరు 24, ఈ ఏడాది జనవరిలో కేంద్రం లేఖలు రాసింది. ‘బిల్లులోని క్లాజు 2 (9), 21, 10, 11, 42(1)(ఎఫ్), 44 అంశాలపై స్పష్టత లేదు. అవి కేంద్ర చట్టాల్లోని అంశాలతో పోటీపడుతున్నాయి. క్లాజు 41 ద్వారా సివిల్ కోర్టుకుండే అధికారాలను రద్దుచేశారు. అదే సమయంలో క్లాజు 55 ద్వారా అప్పిలేట్ అథారిటీ ఇచ్చే ఆదేశాన్ని మళ్లీ జిల్లా కోర్టులో అప్పీలు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు.ఏమిటీ గందరగోళం? సివిల్ కోర్టు అధికారాలను రద్దుచేసేలా నిబంధనలు ఎలా తెస్తారు? దీంతోపాటు పలు అంశాలపై స్పష్టత లేదు. కేంద్ర చట్టాలను ధిక్కరించే అంశాలను మార్చుకోవాలి’ అని సూచించింది.
ఇటీవల రెవెన్యూ శాఖ ఒక్కో అభ్యంతరానికి సమాధానాలిచ్చినా కేంద్రం ఏకీభవించలేదని తెలిసింది. తాము లేవ నెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. కీలకమైన 4 అంశాల్లో, అందులోనూ రెండు క్లాజులను పూర్తిగా మార్చుకోవాలని తేల్చిచెప్పినట్లు తెలిసింది. దానర్థం.. టైటిల్ బిల్లును ఆమోదించడం కుదరదని స్పష్టం చేసినట్లేనని.. ఆ బిల్లును వెనక్కి పంపించినట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి పరిష్కారం ఏమిటి? కేంద్రం అడ్డుచెప్పిన అంశాలు లేకుండా బిల్లును మార్చాలి. సవరణ బిల్లును అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. గవర్నర్ ద్వారా మరోసారి కేంద్ర ఆమోదానికి పంపాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
16 నెలల తర్వాత వెనక్కి..
బిల్లును రూపొందించేటప్పుడే న్యాయనిపుణుల సలహాలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఎంతో మంది న్యాయ, రెవెన్యూ నిపుణులు ఉన్నా వారిని కాదని సర్వే శాఖకు చెందిన ఇద్దరు జూనియర్ అధికారులకు ముసాయిదా రూపకల్పన బాధ్యత అప్పగించారన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రం కొర్రీలకు జవాబులిచ్చే పనీ వారికే కట్టబెట్టారు. బిల్లును కేంద్రం ఆమోదించే పరిస్థితి లేదన్న సంకేతాలు వచ్చాక సీనియర్ అధికారులు రంగంలోకి దిగి నిపుణులతో జరిపినా ఉపయోగం లేకపోయింది. 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అది తిరిగి వెనక్కి వచ్చేసినట్లు తెలిసింది. కానీ దీనికి ఆమోదముద్ర పడుతుందన్న నమ్మకంతోనే.. ప్రభుత్వం జనవరి నుంచి సమగ్ర భూముల రీసర్వే చేపట్టాలనుకుంటోంది.