-
-
Home » Andhra Pradesh » KRISHAN RIVER OVERFLOWS
-
బిరబిరా కృష్ణమ్మ
ABN , First Publish Date - 2020-08-20T08:38:21+05:30 IST
బిరాబిరా కృష్ణమ్మ కదిలి వస్తోంది. శ్రీశైలం గేట్లు దాటుకుని దూసుకొస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటం, ఇప్పటికే ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులో మూడు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌కు 79,457 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు...

- నిండిన శ్రీశైలం.. సాగర్‌కు నీటి విడుదల
- శ్రీశైలానికి 3.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- 3 గేట్లు ఎత్తి.. సాగర్‌కు నీరు విడుదల
- తుంగభద్ర నుంచీ పెరుగుతున్న వరద
బిరాబిరా కృష్ణమ్మ కదిలి వస్తోంది. శ్రీశైలం గేట్లు దాటుకుని దూసుకొస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటం, ఇప్పటికే ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులో మూడు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌కు 79,457 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కర్నూలు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నిండింది. దీంతో బుధవారం మూడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు 79,457 క్యూసెక్కుల నీరు వదిలారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లు ఎత్తారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాల కారణంగా జూరాల జలాశయం నుంచి బుధవారం సాయంత్రానికి 39 గేట్ల ద్వారా 3,16,258 క్యూసెక్కులు కిందకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా, బుధవారం సాయంత్రానికి 881.3 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, 195.2 టీఎంసీల నీరు చేరింది. అలాగే, నారాయణపూర్ డ్యామ్‌కు 2,96,638 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఈ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 3,21,357 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో జూరాల ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 2,92,000, పవర్ హౌస్ నుంచి 21,326, సుంకేసుల నుంచి 72,238 వెరసి 3,85,880 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1631.86 అడుగులు ఉంది. జూరాల నుంచి మరో ఐదు రోజుల పాటు 3లక్షల క్యూసెక్కులకు తగ్గకుండా వరద కొనసాగుతుందని అధికారులు నిర్ధారించడంతో శ్రీశైలం 3 గేట్లు ఎత్తారు. కాగా, అమావాస్య కారణంగా శ్రీశైలం గేట్లు ఎత్తడానికి జలవనరుల శాఖాధికారులు తర్జనభర్జన పడ్డారు. తొలుత రెండ్రోజులు ఆగి ఎత్తాలనుకున్నా, వరద ఉధృతి పెరుగుతుండటంతో నీటిని కిందకు విడుదల చేశామని చెబుతున్నారు.
కేబినెట్ కారణంగా మంత్రి అనిల్ కుమార్ ఈకార్యక్రమానికి హాజరు కాలేదని అధికారులు అంటున్నా, అమావాస్య నాడు గేట్లు ఎత్తడం ఇష్టం లేకే ఆయన రాలేదని ఆ పార్టీ పెద్దలే గుసగులాడుకుంటున్నారు. గురువారం నుంచి సీమ జిల్లాల్లోని ఆయకట్టు ప్రాంతాలకూ నీటిని వదులుతారు.