కొవ్వూరు టీడీపీలో వర్గపోరు.. మాజీ మంత్రి ఫోకస్...!

ABN , First Publish Date - 2020-10-13T17:20:38+05:30 IST

ఆ నియోజకవర్గం టీడీపీ నేతల మధ్య మొదటి నుంచి తారతమ్యమే. రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఆధిపత్య పోరు...

కొవ్వూరు టీడీపీలో వర్గపోరు.. మాజీ మంత్రి ఫోకస్...!

ఆ నియోజకవర్గం టీడీపీ నేతల మధ్య మొదటి నుంచి తారతమ్యమే. రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఆధిపత్య పోరు కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. పైపెచ్చు ఇటీవల జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష నియామక సమయంలో విభేదాలు మరోసారి రెచ్చకెక్కాయి. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారానికి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అందరినీ కలుపుకుపోవడానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారు? ఇంతకీ ఎవరా నేత? వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


అప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు...

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ స్ధానానికి టీడీపీలో ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఓటర్లు ఆ పార్టీకే చాలాసార్లు పట్టం కట్టారు. తెలుగుదేశం అధికార పార్టీ హోదా కోల్పోయి, ప్రతిపక్షంలో కూర్చున్న ఎన్నికల్లోనూ ఇక్కడ ఓటర్లు మాత్రం టీడీపీ వెంటే నడిచారు. అంతేకాదు, గతంలో ఈ నియోజకవర్గం టీడీపీలో అభిప్రాయ భేదాలకు తావుండేది కాదు. అయితే అదంతా నియోజకవర్గాల పునర్విభజన జరగక ముందు మాట. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఎప్పుడైతే కొవ్వూరు రిజర్వుడ్ కేటగిరిలోకి వెళ్లిందో అప్పటినుంచి గ్రూపు రాజకీయాలు ఈ నియోజకవర్గాన్ని పట్టిపీడించడం మొదలుపెట్టాయి. నాయకులు గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యపోరుకి తెగబడటం, మా మాటే చెల్లాలనే రీతిలో వ్యవహరించడం వంటివి మామూలు విషయాలుగా మారాయి. 2019 ఎన్నికల ముందు నుంచి అయితే.. ఈ పరిస్థితి మరింత పెచ్చుమీరింది. అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన జవహార్‌కు వ్యతిరేక వర్గం ఏర్పడి, ఆయన చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం మొదలుపెట్టింది. అదృష్టమేమిటంటే.. ఆ నియోజకవర్గం నుంచి జవహార్ ఈసారి పోటీ చేయకుండా కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయడం. ఇక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, అదే సమయంలో జవహార్ కూడా గెలవకపోవడంతో కొవ్వూరులోగ్రూపు రాజకీయాలు తగ్గుతాయని అంతా అనుకున్నారు. అయితే యథాలాపంగానే మళ్లీ వర్గపోరు మొదలైంది.


ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ పదవిని ఇవ్వొద్దని...

ఇదిలాఉండగానే, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్థాయి కమిటీలను నియమించింది. రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధ్యక్షునిగా మాజీ మంత్రి జవహార్‌కే పగ్గాలు అప్పగించింది. ఈ నియామకానికి ముందు కొవ్వూరులో బాగానే రాజకీయాలు నడిచాయి. అప్పటివరకు స్తబ్దుగా ఉన్న జవహార్ వర్గం ఒక్కసారిగా యాక్టివ్ అయింది. రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధ్యక్షునిగా జవహార్ పేరును పార్టీ అధిష్టానం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు అన్ని మాధ్యమాల్లోనూ తీవ్రస్థాయిలో ప్రచారం సాగింది. దీంతో జవహార్ వ్యతిరేక వర్గం అత్యవసర సమావేశాన్ని కొవ్వూరులోనే నిర్వహించింది. ఆ పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు ఇవ్వకూడదని ఒక తీర్మానాన్ని కూడా వారు ఆమోదించుకుని దానినే హైకమాండ్‌కు పంపారు. అధిష్టానం మాత్రం జవహార్ వ్యతిరేక వర్గ భేటీని, వారి తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అందరూ అనుకున్నట్లుగానే, ఆయనకే రాజమండ్రి పార్లమెంటు కమిటీ పగ్గాలను అప్పగించింది. దీంతో ఆయన వ్యతిరేక వర్గమంతా సైలెంట్ అయిపోయారు. ఇక్కడవరకు బాగానే ఉంది. అయితే రాబోయే రోజుల్లో జవహార్ ఏ విధంగా వ్యవహరిస్తారోనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఆయన ఏం చేస్తారో చూడాలి...

అసలే పార్టీ కష్టకాలంలో ఉంది. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణం. ఈ సమయంలో అందరినీ కలుపుకుపోవాల్సిన బాధ్యత జవహార్‌పై ఉంది. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి, పార్టీని సంసిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అందరినీ ఎలా కలుపుకుపోతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాజమండ్రి లోక్ సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల టీడీపీ నాయకులతోనూ జవహార్ సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టారు. పార్టీలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. మరి కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ విభేదాలు, వర్గపోరుపై జవహార్ ఏ విధంగా ముందుకు వెళతారో చూడాలి.

Updated Date - 2020-10-13T17:20:38+05:30 IST