‘కొవిన్‌’లో పేరుంటేనే కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-12-13T08:42:40+05:30 IST

కొవిడ్‌-19 టీకా నిర్వహణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ప్రజలను రక్షించడం,

‘కొవిన్‌’లో పేరుంటేనే కొవిడ్‌ వ్యాక్సిన్‌

తొలుత 30 కోట్ల మందికి టీకాలు

కేంద్ర ప్రభుత్వ కరోనా వ్యాక్సిన్‌ 

నిర్వహణ మార్గదర్శకాలు 


హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌-19 టీకా నిర్వహణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ప్రజలను రక్షించడం, కరోనా కారణంగా సంభవించే సామాజిక, ఆర్థిక ప్రభావాలతో పాటు మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని అందులో పేర్కొంది.  మొత్తం 113 పేజీల మార్గదర్శకాలలో కరోనా నివారణ, వ్యాక్సిన్‌, పలు స్థాయిల్లో టీకా నిర్వహణ, మానవ వనరులు, వారికి శిక్షణ,  కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ (కొవిన్‌) సాప్ట్‌వేర్‌, వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియ, టీకా నిల్వకు సంబంఽధించిన శీతల గిడ్డంగుల వ్యవస్థ నిర్వహణ, టీకా దుష్ఫ్రభావం ఎదుర్కోవడం, పర్యవేక్షణ వంటి అంశాలకు సంబంధించిన విషయాలను ఆ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మొత్తం 23 మంత్రిత్వ శాఖలను భాగస్వామ్యం చేసినట్లు అందులో వెల్లడించింది. వాటి పాత్ర ఏ విధంగా ఉండాలనేది ఆయా మార్గదర్శకాల్లో పొందుపరిచింది. కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమ విజయం అనేది, దాన్ని ప్రజలకు అందించే మానవ వనరులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది.


మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు..

కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు టీకాను ఇవ్వాలి. 

కొవిన్‌ సాప్ట్‌వేర్‌ ద్వారా గుర్తించిన లబ్ధిదారులకే  టీకాలు వేయాలి. 

సాధారణ పౌరులు వ్యాక్సిన్‌ కోసం ‘కొవిన్‌’ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోదలిస్తే గుర్తింపు కార్డు తప్పనిసరి. అందుకు మొత్తం 12 రకాల గుర్తింపు కార్డులలో ఒకదానిని వాడుకోవచ్చు. వాటిలో ఆధార్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, ఉపాధిహామీ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్‌, పెన్షన్‌ ధ్రువపత్రాలు, ఓటరు ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే గుర్తింపు కార్డులు ఉన్నాయి.

ఒక వ్యాక్సినేషన్‌ సెషన్‌లో 100 మందికే వ్యాక్సిన్‌ వేయాలి. 

వ్యాక్సిన్‌ కేంద్రంలో మూడు గదులు ఏర్పాటు చేయాలి. వేచి ఉండు గది, టీకా గది, అబ్జర్వేషన్‌ రూమ్‌ (వ్యాక్సిన్‌ తీసుకున్నాక వేచి ఉండే గది) ఏర్పాటు చేసుకోవాలి. టీకా తీసుకున్న వారిలో ఏమైనా దుష్ప్రభావం తలెత్తితే తక్షణ వైద్య సదుపాయం అందించాలి. 

వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. ఆ సమాచారపు లింకులో వ్యాక్సిన్‌ ఎక్కడ, ఎప్పుడు తీసుకున్నారు? తదుపరి ఎప్పుడు, ఎక్కడ తీసుకోవాలి; ఎవరు టీకా ఇస్తారు? వ్యాక్సిన్‌ బ్యాచ్‌ ఏంటన్న వివరాలు ఉంటాయి. 

ఈ కార్యక్రమం కోసం అన్ని రాష్ట్రాలు స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎన్నికలా పకడ్బందీగా జరపాలి. 

తొలి దశలో దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందిస్తారు. వారిలో కోటిమంది వైద్య సిబ్బంది, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 27 కోట్ల మంది యాభై ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు. 

Updated Date - 2020-12-13T08:42:40+05:30 IST