రాజకీయ రణం.. విషాద మరణం
ABN , First Publish Date - 2020-09-16T10:18:12+05:30 IST
వైద్యుడిలో ఉండే కరుణ.. అభివృద్ధి పట్ల ఆతృత... రాజకీయాల్లో అలుపెలుగని పోరాటం! ఇది... డాక్టర్ కోడెల శివప్రసాదరావు నైజం. ‘పల్నాటి పులి’గా పేరొందిన ఆయన చివరికి బలవన్మరణం ..

- రాజకీయ శస్త్రకారుడు డాక్టర్ కోడెల
- నేడు కోడెల శివప్రసాదరావు తొలి వర్ధంతి
నరసరావుపేట, సెప్టెంబరు 15: వైద్యుడిలో ఉండే కరుణ.. అభివృద్ధి పట్ల ఆతృత... రాజకీయాల్లో అలుపెలుగని పోరాటం! ఇది... డాక్టర్ కోడెల శివప్రసాదరావు నైజం. ‘పల్నాటి పులి’గా పేరొందిన ఆయన చివరికి బలవన్మరణం పాలయ్యారు. కోడెల కన్నుమూసి బుధవారానికి ఏడాది! గుంటూరు జిల్లా కండ్లగుంట గ్రామంలో 1947 మే రెండో తేదీన కోడెల జన్మించారు. నరసరావుపేటలో సొంతంగా వైద్యశాలను నిర్వహించే సమయంలో ఆయనను ఎన్‌టీఆర్ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినా ఆయన ఎన్నడూ కండువా మార్చలేదు. 36 ఏళ్లు టీడీపీలోనే ఉన్నారు. ఎన్‌టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేశారు. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు వరుసగా నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి పీఠం అధిష్ఠించిన అరుదైన గౌరవమూ అయనదే. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించారు.
జీవితమంతా పోరాటమే..
ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై ఆయనది రాజీ లేని బాట! వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతుల కోసం గొంతెత్తి లాఠీ దెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లారు. దీక్షలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై పలు కేసులు నమోద య్యాయి. తన కార్యకర్తలను నిర్బంధించినా, అక్రమంగా కేసులు పెట్టినా.. అంతే తీవ్రంగా ఆయన స్పందించేవారని సన్నిహితు లు గుర్తు చేసుకొంటారు. కోటప్పకొండ పవిత్రతను కాపాడాలం టూ నరసరావుపేట నుంచి కొండపై దాకా నడిచారు. సైకిల్‌పై 200 కిలోమీటర్లమేర తన నియోజకవర్గంలో తిరుగుతూ నీటి లో చేపలా జనంలో మెలిగారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిపై కోడెల ముద్ర సుస్పష్టం. భక్తులకు కోటప్పను చేరువ చేశారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు, ఘాట్ రోడ్డు నిర్మాణం దగ్గరుండి చేయించారు.
ఈ పనులు చేపట్టడానికి ముందు ఈ ఆలయం వార్షిక ఆదా యం రూ.10 లక్షలు దాటేది కాదు. అలాంటిది ఇప్పుడది రూ. ఐదు కోట్లకు చేరింది. బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు చైర్మన్‌గా పని చేసిన కాలంలో ఆ సంస్థ అభివృద్ధికి వినూత్న ఆలోచనలు చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడు డాక్టర్ కోడెల సత్యనారాయణ జ్ఞాపకార్థం ధర్మ సంస్థను పెట్టి దానిద్వారా వివిధ ప్రాంతాలలో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, మందులు పంపిణీ చేయించారు. మరణాంతరం అవయవదానం చేస్తామని ఎవరికి వారు వ్యక్తిగతంగా హామీఇస్తుంటారు. తొలిసారి ఈ పనిని డాక్టర్ కోడెల సామూహికంగా మార్చేశారు. నరసరావుపేటలో 2017లో దీనిపై భారీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది.. ‘అవయవ దానం చేస్తాం’ అంటూ పత్రాలను అందించారు. ఇది గిన్నీస్ రికార్డులో నమోదైంది. తన అభిరుచికి తగినట్లు నరసరావుపేటలో తెలుగు నాటకరంగ దినోత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహించేవారు. ఇక్కడే క్రీడా స్టేడియాన్ని సుమారు రూ.కోటిన్నర వ్యయంతో పూర్తిచేయించారు.
కోడెల ప్రథమ వర్ధంతికి అడ్డంకులు
కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాలకు పోలీసులు అడ్డంకులు కల్పించారు. బుధవారంతో ఆయన మరణించి ఏడాది. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం నరసరావుపేట సహా గుంటూరు జిల్లాలో పలుచోట్ల కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు పలు కార్యక్రమాలు జరపడానికి సిద్ధమవుతున్నాయి. అయితే, కొవిడ్ నిబంధనల పేరుతో నిర్వాహకులకు పోలీసులు నోటీసులిచ్చారు. కోడెల తనయుడు డాక్టర్ కోడెల శివరామ్, నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవిందబాబుకు ఈ నోటీసులిచ్చారు.
తొలి వర్ధంతి సందర్భంగా.. నరసరావుపేటలో రక్తదాన శిబిరం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోడెల విగ్రహాలను పలు చోట్ల ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాలను నిలిపివేయాలని ఆ నోటీసుల్లో పోలీసులు ఆదేశించారు. అయితే, వైసీపీ సభలకు లేని అడ్డంకులు తమకేందుకని శివరామ్ ప్రశ్నించారు. రాజకీయ కక్షసాధింపులతో కోడెలను బలితీసుకొని, ఇప్పుడు ఆయన ప్రథమ వర్ధంతిని కూడా జరగనీయకుండా అడ్డుకోవాలనుకోవడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.