కొడాలి నాని.. అసలు మర్మం ఇదేనా?

ABN , First Publish Date - 2020-09-13T00:47:13+05:30 IST

అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు వైసీపీలోనే పెను ప్రకంపనలు రేపుతున్నాయి.

కొడాలి నాని.. అసలు మర్మం ఇదేనా?

అమరావతి: అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు వైసీపీలోనే పెను ప్రకంపనలు రేపుతున్నాయి. సీఎం జగన్ మెప్పు పొందేందుకే నాని తరుచు అలా మాట్లాడుతున్నారని, అతిగా ప్రవర్తిస్తున్నారని స్వపక్షంలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ఎందుకుంటే రెండున్నర ఏళ్ల తర్వాత తన మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయని, పనితీరును బట్టి కొత్తవారికి అవకాశం.. ప్రతిభ కనబర్చని వారికి ఉద్వాసన ఉంటుందని జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచింది. ఇక కేబినెట్ విస్తరణ గడువు ఇక ఏడాది మాత్రమే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొడాలి నాని ప్రతిపక్షంపై స్వరం పెంచడం.. సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారంట.     


అమరావతి నుంచి విశాఖకు పరిపాలన రాజధానిని తరలించడానికి సీఎం ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే రాజధాని తరలింపు అంశాన్ని టీడీపీ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాని రెచ్చిపోతున్నారని, జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే.. అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అమరావతి రైతులు తమ విలువైన భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. వాటిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏమిటని, ఆ ప్రాంత రైతులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వారు చేసే వాదనలు, విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపాయి. ఆయన మాటలు అధికార వైసీపీకే రివర్స్ అయ్యాయి. ఏపీలో సున్నితంగా మారిన రాజధాని అంశంపై వైసీపీ పెద్దలు రోజుకొక మాట మాట్లాడడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమరావతిలో కనీసం శాసన రాజధానిని కూడా ఉంచరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకు సొంత పార్టీ నేతలెవ్వరూ కొడాలి నాని వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం లేదట. పైగా లోలోపల ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారని తెలుస్తోంది.

Updated Date - 2020-09-13T00:47:13+05:30 IST