కిల్లర్‌ కరోనా

ABN , First Publish Date - 2020-04-21T08:33:12+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్‌ మూడోదశ ప్రారంభంలో ఉందని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు... ఇది మరింత ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 40 మందికి వైరస్‌ ఎలా,

కిల్లర్‌ కరోనా

  • చాపకింద నీరులా వ్యాపిస్తున్న వైరస్‌
  • వ్యక్తుల అలసత్వం... నేతల నిర్లక్ష్యం
  • కర్నూలు నుంచి రాజమండ్రిదాకా...
  • ‘కాంటాక్ట్‌’కు చిక్కకుండా కేసులు
  • తప్పని తెలిసీ ‘పాజిటివ్‌’లకు వైద్యం
  • ఆ డాక్టర్ల ద్వారా మరెందరికో వైరస్‌
  • ఎవరిద్వారా ఎవరికనేది తెలిస్తేనే
  • క్వారంటైన్‌కు పంపి రక్షించే వీలు
  • ప్రజలు సహకరించకపోతే కష్టమే!


శ్రీకాళహస్తిలో వారం క్రితం ఓ ప్రజాప్రతినిధి సామాన్యులను ఆదుకునే పేరిట భారీ జాతర నిర్వహించారు. అధికార యంత్రాంగాన్ని, తన అనుచరులు, మందీమార్బలాన్ని వెంటేసుకొని నిత్యావసరాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భారీగా ఫొటోసెషన్‌ కూడా జరిగింది. సీన్‌ కట్‌చేస్తే, సరిగ్గా ఐదు రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో పలువురికి వైరస్‌ సోకింది. అందులో అత్యధికులు రెవెన్యూ ఉద్యోగులే కావడం గమనార్హం.


 ట్రేస్‌... టెస్ట్‌... ట్రీట్‌!

కరోనాపై పోరులో ఇవే కీలకం! విదేశాల నుంచి వచ్చిన వారు... వారిద్వారా వైరస్‌ సోకిన వారిని గుర్తించడం తొలిదశ! దీనికి... మర్కజ్‌ నిజాముద్దీన్‌ కేసులూ తోడయ్యాయి. వీరిని గుర్తించి, పరీక్షించి, చికిత్సలు అందిస్తుండగానే.... ఎక్కడ, ఎలా, ఎవరి ద్వారా వైరస్‌ సోకిందో గుర్తించలేని ప్రమాదకర పరిస్థితి తలెత్తుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిశ్శబ్దంగా విస్తరిస్తోంది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం చకచకా పాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆందోళనకర విషయమేమిటంటే... కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బందికీ వైరస్‌ సోకుతోంది. విషాదమేమిటంటే... పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన నిపుణులే వైరస్‌ వాహకాలుగా మారడం! ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన నాయకులే ‘సహాయం’ పేరిట జన జాతర చేయడం!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్‌ మూడోదశ ప్రారంభంలో ఉందని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు... ఇది మరింత ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 40 మందికి వైరస్‌ ఎలా, ఎవరిద్వారా సోకిందో గుర్తించలేకపోయారు. వీరికి ఎలాంటి ప్రయాణ నేపథ్యం లేదు. ఢిల్లీ కనెక్షన్‌ కూడా లేదు. కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడితో మొదలైన ‘నిశ్శబ్ద విస్తృతి’ అటు తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తోంది. అనంతపురం, రాజమండ్రి, గుంటూరు, శ్రీకాళహస్తి వంటి అనేక ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి.  ఒక కరోనా పాజిటివ్‌ కేసు మూలం తెలుసుకోవాలంటే ముందు దాని కాంటాక్ట్‌ బయటకు రావాలి. ఆ వ్యక్తి ఎంతమందిని కలిశారు? తాజాగా పాజిటివ్‌గా వచ్చిన వ్యక్తి కొత్తగా ఎంతమందితో కాంటాక్ట్‌ అయ్యారో తెలుసుకోవాలి.


అలా కాంటాక్ట్‌ లిస్టును గుర్తించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఎలాంటి మినహాయింపులివ్వకుండా వారందరినీ క్వారంటైన్‌ చేస్తేనే ఆ చైన్‌ ఆగిపోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ఉద్దేశం కూడా అదే. కానీ... సడలింపు సమయంలో జనం యథేచ్ఛగా రోడ్లమీదికి వచ్చేస్తున్నారు. ఇక, నేతలూ సహాయ చర్యల పేరిట నిబంధనలు పాటించకుండా జాతర చేస్తున్నారు. దీని ఫలితాన్ని శ్రీకాళహస్తి పట్టణం అనుభవిస్తోంది. ‘‘ఇప్పుడు వీరి కాంటాక్ట్‌లు ఎవరో.. ఎక్కడున్నారో గుర్తించి పరీక్షలు నిర్వహించాలి. లేదంటే కేసుల సంఖ్య ఎంత పెరుగుతుందో ఊహించడమే కష్టం. తాము కాంటాక్ట్‌లమంటూ ఎవ్వరూ ముందుకు రాకపోవడం మరింత ఆందోళనకరం’’ అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక్కడ ఈనెల 17 నుంచి 19వరకు వందల మందికి పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు వెలువడాల్సి ఉంది.


ప్రాణాంతకమైన నిర్లక్ష్యం

కర్నూలు నగరంలో ఆయన ఓ ప్రముఖ వైద్యుడు. ఫీజు తక్కువ, హస్తవాసి మంచిదన్న పేరుండడంతో స్థానికులతోపాటు, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, గద్వాల, నిజామాబాద్‌ తదితర  ప్రాంతాల నుంచి సామాన్యులు వచ్చి చికిత్స చేయించుకుంటారు. ఇంత వరకు బాగానే ఉంది. కరోనా డేంజర్‌బెల్స్‌ మెగిన తర్వాత, ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన కొందరికి ఆ వైద్యుడు గుట్టుగా వైద్యం చేశారు. ఆ తర్వాత  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మందికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. కరోనా గుట్టుగా ఉండనివ్వదుకదా...ఆ డాక్టర్‌కు ప్రాణాలమీదకు తీసుకొచ్చింది. ఓ రోజు అనూహ్యంగా ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ మరణించారు. ఇప్పుడు సమస్యల్లా... ఈ డాక్టర్‌ను కలిసిన వారు ఎవరు? వారి పరిస్థితి ఏమిటో నిగ్గుతేల్చాలి. తాము ఆ వైద్యుడి దగ్గర చికిత్స తీసుకున్నామని ఇప్పటిదాకా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ‘‘ఆ వైద్యుడు ముందుగానే జాగ్రత్త తీసుకొని ఉంటే ఆయన బ్రతికి ఉండేవారు. ఇతరులను ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉండేది కాదు. అన్నీ తెలిసి జాగ్రత్తలు పాటించకపోవడంతో తీవ్రమూల్యం చెల్లించాల్సి వస్తోంది’’ అని సీనియర్‌ వైద్యాధికారి ఆందోళన వ్యక్తం చేశారు.


గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైద్యురాలు ఇటీవల ఓ హమ్‌గార్డుకు చికిత్స అందించారు. నిజానికి ఆ హోమ్‌గార్డుకు కరోనా పాజిటివ్‌ ఉంది. అయినా ఆమె చికిత్స చేసి.. తానూ కరోనా బారినపడ్డారు. ఇటీవలి కాలంలో ఆ మహిళా డాక్టర్‌ ఎంత మందికి చికిత్స చేశారు? వారు ఏ ప్రాంతాలకు చెందినవారే గుర్తించి తక్షణమే వారిని క్వారంటైన్‌ చేయాలి. కానీ ఆ డాక్టర్‌ కాంటాక్ట్‌ల జాబితా చెప్పడం లేదు. ఈ క్రమంలో ఈనెల 14న నరసరావుపేటలో పలువురికి పరీక్షలు చేయగా, 20కిపైగా పాజిటివ్‌ వచ్చాయి. అలాగే, రాజమండ్రిలో ఓ ఆర్‌ఎంపీకి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయనకు ఎలా వచ్చిందని ఆరాతీస్తే...ఓ పాజిటివ్‌ పేషంట్‌కు చికిత్స చేశారని వెలుగుచూసింది. మరి, ఆ ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకొన్నవారెవరూ ఇప్పుడు ముందుకు రావడం లేదు.


అనంతపురం జిల్లాలో ఓ ఏఎ్‌సఐ మరణించారు. ఆయన అంత్యక్రియలు అయ్యేదాకా కరోనా పాజిటివ్‌ అని తేలలేదు. దీంతో తమ సన్నిహితుడైన అధికారికి అంతిమ వీడ్కోలు పలికేందుకు సీఐతో సహా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తీరా ఆయనకు పాజిటివ్‌ అని తేలడంతో అంత్యక్రియలకు హాజరైన అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.


‘అంటుకుంటే’ అంతమే!

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్‌లో 17 మరణాలను ధ్రువీకరించగా, 24 గంటల వ్యవధిలోనే మరో ముగ్గురు చనిపోయారు. గుంటూరులో సోమవారం ఇద్దరు చనిపోయారు. వారి మరణాలను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. అవీ కలుపుకొంటే మరణాలు 22కు చేరతాయి. దేశ వ్యాప్తంగా చూస్తే అత్యధిక మరణాలు నమోదవుతున్న ఆరో రాష్ట్రం మనదే. ఈ విషయంలో తెలంగాణ(21)నూ దాటిపోయింది. ఏపీలో ఇప్పటిదాకా 722 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, విదేశాల నుంచి, ఢిల్లీ నుంచి రాష్ట్రంలోకి వచ్చిన వారు బాగానే ఉన్నారు. వారిలో కొంత మందికి నయం అయిపోతుంది. మరికొంత మంది జాగ్రత్తగా చికిత్స పొందుతున్నారు. కానీ అక్కడ నుంచి వచ్చిన వారి కాంటాక్టులోకి వెళ్లినవారే ప్రమాదంలో పడుతున్నారు. నెల్లూరు, కర్నూలులో మృతి చెందిన డాక్టర్ల ఉదంతాలే దీనికి ఉదాహరణ. విజయవాడకు చెందిన 54ఏళ్ల వ్యక్తిది తొలి కరోనా మరణం. అతనికి కొడుకు వల్ల వైరస్‌ సోకింది. 

Updated Date - 2020-04-21T08:33:12+05:30 IST